అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వారంలో భారత్-పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగేది. భారత్ పాక్‌ల మధ్య చర్చలు జరగాలన్న పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. అయితే, ఆ తర్వాత 24 గంటల్లోనే పాక్‌తో చర్చలు జరిపేది లేదని భారత్ స్పష్టం చేసింది. కశ్మీర్‌లో ‘భారత ప్రభుత్వ దురాగతాల’పై వెలువడిన తపాలా బిళ్లలే చర్చల రద్దు నిర్ణయానికి ప్రధాన కారణంగా భారత విదేశాంగ శాఖ చెబుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సరిహద్దు భద్రతా దళం సైనికుడిని గొంతుకోసి దారుణంగా చంపడం, ముగ్గురు కశ్మీరీ పోలీసులను కిడ్నాప్ చేసి చంపేయడం కూడా మరో కారణమని అంటోంది.
బుర్హాన్ వనీ ఫోటోతో స్టాంపు
8 రూపాయల విలువైన 20 తపాలా బిళ్లలను పాకిస్తాన్ విడుల చేసింది. ‘భారత్ ఆక్రమిత కశ్మీర్‌లో అత్యాచారాలు’ పేరుతో విడుదలయిన ఈ తపాలా బిళ్లపై కశ్మీర్‌లో వివిధ సందర్భాల్లో జరిగిన ఘటనల బాధితుల ఫోటోలు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కశ్మీర్ తీవ్రవాది బుర్హాన్ వనీ ఫోటోతో ఒక స్టాంపు ఉంది. బుర్హాన్‌ను స్వతంత్రయోధుడిగా ఆ తపాల బిళ్లపై పేర్కొన్నారు. అలాగే, భద్రతా దళాల వాహనం బానెట్‌పై ఫరూఖ్ అహ్మద్ దార్ అనే నిరసనకారుడిని కట్టేసి తీసుకెళుతున్న ఫోటోను ‘హ్యూమన్ షీల్డ్’ పేరుతో మరో తపాలా బిళ్లపై ముద్రించారు.
రసాయన ఆయుధాలు, పెల్లెట్ల బాధితులుగా చెపుతున్న వారి ఫోటోలు, కశ్మీర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు మొదలైన ఫోటోలు ఇతర స్టాంపులపై ఉన్నాయి. ఈ తపాలా బిళ్లల రూపకల్పనను బట్టి తీవ్రవాదం విషయంలో పాక్ కొత్త ప్రభుత్వం కూడా పాత దారిని మార్చుకోలేదని, కొత్త ప్రధాని అసలు స్వరూపం బయటపడిందని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
ఎవరి పని ఇది
భారత్‌కు వ్యతిరేకంగా ఈ తపాలా బిళ్లలను ఎవరు తెచ్చారన్నది స్పష్టం కాలేదు. దేశంలో ఎవరైనా ఇలాంటి స్మారక తపాలా బిళ్లల ప్రతిపాదన చేయవచ్చని పాక్ తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘ఇలాంటి ప్రతిపాదనను తపాలా శాఖ ఆమోదిస్తే, కమ్యూనికేషన్ల మంత్రిత్వ, విదేశాంగ శాఖల ఆమోదానికి వెళుతుంది. అది కూడా అయితే తుది ఆమోదం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళుతుంది. ’అని ఆయన వివరించారు. ఎన్నికలకు ముందున్న తాత్కాలిక ప్రభుత్వానిదే ఈ ఆలోచన అని దాని హయాంలోనే ఈ తపాలా బిళ్లలు బయకొచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
ఎప్పుడు విడుదలయ్యాయి
పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు జులై 24న వీటిని విడుదల చేయడం జరిగింది. అంటే ఇమ్రాన్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడానికి 25 రోజుల ముందన్న మాట.
ఎలా అమ్మారు
ఈ తపాలా బిళ్లలను 20 బిళ్లలు ఒక షీటు చొప్పున మొత్తం 20వేల షీట్లు ముద్రించారు. ఈషీటు విదేశాల్లో ఒక్కొక్కటి 6 డాలర్ల చొప్పున అమ్ముడుపోయాయని పాకిస్తాన్‌లోని తపాలా బిళ్లల సేకరణాభిలాషులు తెలిపారు. అయితే, తాము ఒక్కోషీటు 1.30 డాలర్ల చొప్పున 300 షీట్లు విక్రయించామని పాక్ తపాలా శాఖ అధికారి ఒకరు చెప్పారు. 20వేలలో చాలా షీట్లు అమ్ముడైనట్టు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment