విద్యార్థిపై దాడి.. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
బెంగళూరు: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిపై దాడి ఘటన పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణమైన ఘటనపై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారని, దాడికి కారణమైన నిందితుడిని అరెస్టు చేశారని ఆయన సోమవారం సాయంత్రం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాడని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన హిగియో గుంటెయ్ అనే విద్యార్థిపై అతని ఇంటి యజమాని హేమంత్‌కుమార్ దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా అతడితో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మార్చి 6న చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. అతనికి బెయిల్ లభించడంతో సోమవారం జైలు నుంచి విడుదలయ్యాడు. బాధితుడు హిగియో క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈశాన్య భారత విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సైతం తీవ్రంగా ఖండించారు.