ఆ బ్యాంక్ అనుమానాస్పద ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తర్వాత ఉద్యోగుల అవినీతితో ప్రముఖ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడం బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. కొన్ని అనుమానాస్పద ఖాతాలను తాత్కాలింగా రద్దు చేసింది.
ఉద్యోగుల అక్రమాలపై కఠిన చర్యల్లో భాగంగా "అపూర్వమైన అడుగు" తీసుకున్నామని సోమవారం వెల్లడించింది. అనుమానాస్పద లావాదేవీల ఖాతాల వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించినట్టు యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొంతమంది అనుమానిత ఖాతాల అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.టి.ఆర్.లను) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాఖలు చేసినట్టు తెలిపింది. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ విజయవంతానికి, డిజిటల్ లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
కాగా గతవారం మూడు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన ఈడీ ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదుచేశారు. అటు బ్యాంకు కూడా అక్రమ లావాదేవీల ఆరోపణలతో 19 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు ఢిల్లీ బ్రాంచ్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.