
ఎజెండాలో కశ్మీర్ ఉంటేనే చర్చలు
మాట మార్చిన పాకిస్తాన్
ముంబై దాడుల కేసులో మరిన్ని వివరాలు కావాలి
పాక్ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మళ్లీ మాటమార్చింది. రష్యాలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ వేడి తగ్గక ముందే అందులో పాలుపంచుకున్న పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ ప్లేటు ఫిరాయించారు. కశ్మీర్ అంశం ఎజెండాలో లేకుండా భారత్‌తో చర్చల ప్రసక్తే లేదని సోమవారం రెండు పేజీల నోట్ విడుదల చేశారు. శాంతి స్థాపన, అభివృద్ధి అంశాలలో రెండు దేశాలూ సమష్టి బాధ్యత కలిగి ఉన్నాయన్న అంశాన్ని రెండు దేశాలూ గుర్తించాయన్నారు. ‘ఇప్పుడు అన్ని అంశాలపై చర్చించటానికి వాళ్లు సిద్ధపడ్డారు. ఆ అంశాలేమిటో మనందరికీ తెలుసు. సహజంగానే కశ్మీర్ అంశం తొలి స్థానంలో ఉంటుంది. అది కాకుండా సియాచిన్, సర్‌క్రీక్, జల వివాదాల వంటివి ఉన్నాయి. పాక్.. కశ్మీర్ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు. ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఉఫా సమావేశం చర్చలకు ప్రారంభం కానే కాదని, అయితే ఈ భేటీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, అర్థవంతమైన చర్చలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడిందన్నారు.
26/11 ముంబై దాడుల విషయంలో మరిన్ని ఆధారాలను, సమాచారాన్ని భారత్ సమకూర్చాల్సి ఉందని అన్నారు. ఈ కేసు నిందితుడు జకీర్ ఉర్ రహమాన్ లఖ్వీ స్వరనమూనాను భారత్‌కు ఇచ్చేది లేదన్నారు. పాకిస్తాన్‌లో అలాంటి చట్టం ఏదీ లేదని నాలుగేళ్ల క్రితమే రావల్పిండి కోర్టు ఈ అంశాన్ని కొట్టివేసిందని స్పష్టం చేశారు. బలూచిస్తాన్‌లో చొరబాట్లను భారత్ ప్రోత్సహించటం, సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుడు ఘటనలనూ అజీజ్ ప్రస్తావించారు. ఇరు దేశాల జాతీయ భద్రతాసలహాదారుల సమావేశాలు మొదట ఢిల్లీలో, తరువాత ఇస్లామాబాద్‌లో జరుగుతాయని అజీజ్ వెల్లడించారు. కాగా, పాక్‌తో భారత్ చర్చలకు సిద్ధపడటాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వేర్పాటువాద నేతలకు పాక్ హైకమిషన్ ఆహ్వానం
న్యూఢిల్లీ: రంజాన్ మాసం ముగిశాక ఈనెల 21న జరిగే ఈద్ మిలన్‌కు రావాల్సిందిగా భారత్‌లోని పాక్ హైకమిషన్ కశ్మీర్ వేర్పాటువాదనేతలను ఆహ్వానించింది. నిజానికి ఈనెల 4నే విందును ఏర్పాటు చేసిన పాక్ హైకమిషన్ తర్వాత 21కి మార్చింది. ఉఫాలో భారత్, పాక్ ప్రధానుల భేటీకి ముందు వాతావరణాన్ని చెడగొట్టకూడదనే పాక్ ఈ తేదీ మార్చిందని పరిశీలకుల అభిప్రాయం.
నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాది హతం
జమ్మూ: జమ్మూలోని నియంత్రణ రేఖ ప్రాంతం నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ ఉగ్రవాదిని సోమవారం బీఎస్‌ఎఫ్ దళాలు హతమార్చాయి. పూంచ్ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దులో ఉన్న బల్నోయి గుండా కొందరు ఉగ్రవాదులు తెల్లవారుజామున భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా జవాన్లు కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది చనిపోయాడు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే-47రైఫిల్, పాకిస్తాన్‌లో ఉత్పత్తి అయినట్లుగా చూపే మార్కింగ్ ఉన్న మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.
మోదీది అసమగ్ర విధానం: విపక్షాల ఆరోపణ
సర్తాజ్ అజీజ్ ప్రకటన నేపథ్యంలో దేశంలో విపక్షాలు ప్రధాని మోదీ విధానంపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. నవాజ్ షరీఫ్‌తో భేటీ అయిన రెండు రోజులకే పాక్ మాటమార్చటంతో ఇక ఆ భేటీకి అర్థం ఏమిటని కాంగ్రెస్ ప్రశ్నించింది. ముంబై దాడుల కుట్రదారులకు శిక్ష పడకూడదన్న పాక్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, పైగా తాను వైఖరిని మార్చుకోలేదంటూ కుండబద్దలు కొట్టిందనీ, అలాంటప్పుడు ప్రధాని స్థాయిలో భేటీ కావటాన్ని ప్రభుత్వం ఏవిధంగా సమర్థించుకుంటుందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రశ్నించారు. మోదీ తన తలకిందుల దౌత్య విధానాన్ని సరిచేసుకోవాలని అన్నారు. అజీజ్ వ్యాఖ్యలను బీజేపీ తేలిగ్గా తీసిపారేసింది. ఉఫా ప్రకటన ఆధారంగానే చర్చలు జరుగుతాయని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు.