
'బాహుబలి-2' ట్రైలర్ ఎప్పుడంటే...!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పకుండా ట్విస్టు ఇచ్చాడు రాజమౌళి. ఆ ట్విస్టు ఏమిటో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు వేచిచూడాల్సిందే. 'బాహుబలి-2' హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' థియెట్రికల్ ట్రైలర్ జనవరిలో విడుదలయ్యే అవకాశముందని దగ్గుబాటి రాణా తెలిపాడు.
ప్రస్తుతం 'బాహుబలి-2' షూటింగ్‌లో బిజీగా ఉన్న రాణా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ 'మేం వేగంగా సినిమా పనులను పూర్తిచేస్తున్నాం. కొద్ది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. ఈ ఏడాది చివర్లో లేదా జనవరిలో ఫస్ట్ ప్రోమో విడుదలయ్యే అవకాశముంది. ఇది టీజర్ లేక థియెట్రికల్ ట్రైలరా అన్నది నాకు తెలియదు. కానీ కచ్చితంగా జనవరిలో ఇది విడుదల కానుంది' అని 'భల్లాలదేవ' రాణా తెలిపాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంలందుకున్న 'బాహుబలి' పార్ట్-1ను మించేస్థాయిలో పార్-2ను తీర్చిదిద్దేందుకు దర్శకుడు రాజమౌళి బృందం శ్రమిస్తోంది. కేవలం క్లైమాక్స్ కోసమే రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. 'ఎక్స్ మెన్', '300' వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులు క్లైమాక్స్ కోసం రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.