పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు!!
బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దారుణంగా దాడిచేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రం వద్ద కూడా ఈ సైకో కలకలం సృష్టించాడు.
ఆ సైకోకు ఇలాంటి వికృత చర్యలు కొత్తకాదు. అతను చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 10న అనంతపురం జిల్లా ధర్మవరం చంద్రబాబునగర్‌లో ప్రమీలమ్మ అనే మహిళపై సైకో దాడి చేశాడు. ఆమె నుంచి రెండు ఏటీఎం కార్డులు లాక్కుని పిన్ నంబర్ తెలుసుకుని ప్రమీలను హత్య చేశాడు. ఆ రాత్రి కదిరికి పారిపోయాడు. 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా 4 వేలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో 15న మరో ఏటీఎం కార్డు ద్వారా 18 వేలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. దాంతో ఆ ఏటీఎం కార్డులు పనికిరాకుండా పోయాయి. దీంతో 19న జ్యోతి ఉదయ్‌పై ఏటీఎం కేంద్రంలోనే దాడి చేసి, ఏటీఎం కార్డును తస్కరించాడు.
కదిరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ.. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడూ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు సీసీ కెమెరా ఫుటేజీలలో తేలింది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. నిందితుడి వ్యహారశైలిని పరిశీలించిన పోలీసులు అతనో సైకోగా తేల్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఈ సైకో కూడా ఉన్నట్లు తెలిసింది.