
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? జాగ్రత్త !
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతి పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువులు మనకు ఎంత సౌలభ్యంగా ఉంటాయో, కొన్ని అంత ప్రమాదకరంగా కూడా ఉంటాయి. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్లు పరోక్షంగా వేరొకరి చేతిలోకి వెళ్లిపోయే ‘డెండ్రాయిడ్’ అనే కొత్త వైరస్ మన దేశంలో వ్యాపిస్తోందట. ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌ను వేరొకరు పరోక్షంగా పూర్తిగా నియంత్రించే అవకాశముందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) నిపుణులు హెచ్చరించారు.
ఈ వైరస్ గనక ఆండ్రాయిడ్‌లో ఇక్కసారి యాక్టివేట్ అయితే ఇక అంతే! ఆ స్మార్ట్‌ఫోన్‌లోని కమాండ్‌ను మార్చడం, కాల్‌లాగ్స్‌ను డిటిట్ చేయడం, వెబ్‌పేజీలను తెరవడం, ఏ నెంబర్‌కైనా డయల్ చేయడం, ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేయడం, ఫొటోలు, వీడియోలను ఫోన్ నుంచి అప్‌లోడ్ చేయడం, ఎసెమ్మెస్‌లను అడ్డుకోవడం వంటివన్నీ చేస్తుంది. ఈ చర్యలన్నింటినీ వైరస్‌తో దాడికి పాల్పడినవారు డెండ్రాయిడ్ టూల్‌కిట్‌తో పరోక్షంగా నియంత్రిస్తారు. మీ ఫోన్లు డెండ్రాయిడ్ బారిన పడకూడదంటే నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలి.
నిపుణులు సూచించిన జాగ్రత్తలు:
1. అనధికార వెబ్‌సైట్ల నుంచి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోరాదు.
2.యాంటీవైరస్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
3. ఎస్‌డీ మెమరీకార్డులను ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి.
4.ఫోన్ ఓవరాల్ యూసేజీని గమనించాలి.
5.ఫోన్ బిల్లు అనూహ్యంగా పెరిగితే అనుమానపడాలి.
6. డాటా యూసేజీ, బ్యాటరీ యూసేజీ మీదా ఓ లుక్కేయాలి.
7.బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీగా దొరికింది కదా అని ఏ వై-ఫై నెట్‌వర్క్ దొరికితే దాన్ని ఉపయోగించుకోరాదు.