బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి!
బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి!
Published Tue, Nov 1 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
భోపాల్: ‘జిందా హై.. మారో’ (బతికే ఉన్నాడు.. కాల్చిపారేయండి).. సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఓ పోలీసు అన్న మాటలివి.. సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిదిమంది ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోగా.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వాళ్లు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మొబైల్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో నిజమైనదా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే, పారిపోయిన సిమీ ఉగ్రవాదులు లొంగిపోయేందుకు సిద్ధపడినా.. నిరాయుధులైన వారిని పోలీసులు కాల్చిచంపేసి.. ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఛాతి మీద కాల్చు.. అతను చనిపోతాడు' అని మరో పోలీసు అంటున్న మాటలు కూడా ఈ వీడియోలో వినిపిస్తున్నాయి.
జైలు నుంచి పరారైన సిమీ ఉగ్రవాదులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని, దీంతో వారు హతమయ్యారని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి చెప్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని ఆయన తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్న సంగతి తెలిసిందే. స్టీల్ కంచం, గ్లాస్తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేసి.. అనంతరం బెడ్షీట్లను తాడులా చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారు. కొంతసేపటికే స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఎనిమిది మంది జాడ కనుక్కొని.. వారిని ఎదురుకాల్పుల్లో హతమార్చారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హతమైన ప్రదేశంలో సిమీ ఉగ్రవాదులు జీన్స్ ప్యాంట్లు, స్పోర్ట్స్ షూలలో కనిపించారు. అంతేకాకుండా వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయి. వారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. జైలు బయట-లోపల వారికి సహకరించింది ఎవరనే దానిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement