రాజ్య సభలో పెద్ద రభస
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు), లోక్సభ సభ్యులు రాజ్యసభలోకి ప్రవేశం, సభల పరువు, రాజ్యాంగ నిబంధనలు, రాజ్యసభ చైర్మన్ విచక్షణాధికారాలు... తదితర అంశాలపై ఈరోజు రాజ్యసభలో పెద్ద రభస జరుగుతోంది. వాయిదాలపై వాయిదాలు వేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై తీవ్ర ఆందోళన, గందరగోళం చోటు చేసుకున్నాయి. ఇప్పటికే లోక్‌సభ పరువు, ప్రతిష్టలు పోయాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాజ్యసభ పరువైనా కాపాడండి, సభ గౌరవం మంటగలపొద్దు అని విజ్ఞప్తి చేశారు. సభను బుల్డోజ్ చేసి బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండని కోరారు. పెద్దలసభలో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు సభ మర్యాదలు పాటించాలన్నారు.
లోక్సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును ఉద్దేశించి లోక్‌సభ సభ్యులు వచ్చి రాజ్యసభను ఆటంకపరచకూడదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. రాజ్యాంగంలో ఈ నిబంధన స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. దయచేసి లోక్‌సభ్యులు సభను విడిచి వెళ్లాలని కురియన్ కోరారు. సీమాంధ్ర సభ్యులు వెల్లోకి వెళ్లడంతో, వెల్లో నిరసన తెలపాలంటే ముందు రాజీనామా చేయండని డిప్యూటీ చైర్మన్ చెప్పారు. సభ సజావుగా సాగేలా సభ్యులు నడుచుకోవాలని కోరారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సభను అడ్డుకోవద్దని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరారు. నచ్చకపోతే సభ నుంచి వెళ్లిపోవాలన్నారు.
రాజ్యసభ సభ్యుడు కానప్పుడు సభను ఎలా అడ్డుకుంటారని రాజ్యసభలో విపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ కావూరిని ఉద్దేశించి ప్రశ్నించారు. మంత్రిగా మాత్రమే సభకు రావొచ్చని తెలిపారు. అంతేతప్ప సభను అడ్డుకోవద్దని కోరారు. రాజ్యసభలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వాళ్ల మంత్రులే బిల్లు ప్రవేశపెడతారు, వాళ్ల మంత్రులే వెల్లోకి వెళ్లి అడ్డుకుంటారని అన్నారు.
నిబంధనల ప్రకారం రాష్ట్ర విభజన బిల్లు పెట్టడానికి వీళ్లేదని విపక్షాలు పట్టుపట్టాయి. కనీసం ఒక రోజు గడువు ఇవ్వాలని కోరాయి. బిల్లుపై చైర్మన్కు విచక్షణాధికారం ఉందని కురియన్ తెలిపారు. ఎప్పుడైనా సభ ముందు బిల్లు పెట్టవచ్చునని చెప్పారు.