
‘కూటమి’ని ఎదుర్కొనేదెలా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ విజయంతో బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నా.. అధిష్టానం మాత్రం 2019 గురించే ఆలోచిస్తోంది. విపక్షాలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన కూటమి
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ విజయంతో బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్నా.. అధిష్టానం మాత్రం 2019 గురించే ఆలోచిస్తోంది. విపక్షాలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన కూటమిగా ఏర్పడొచ్చనే సంకేతాలతో పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఆవిర్భావం కారణంగా ఆ రాష్ట్రంలో బలమైన పట్టుందనుకున్న బీజేపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో అలాంటి మహాకూటమి నిర్మాణం జరిగితే.. దీన్ని ఎదుర్కునేలా వ్యూహాలు రూపొందించాలని ఆరెస్సెస్‌ను కోరినట్లు తెలిసింది.
కొయంబత్తూరులో జరిగిన ఆరెస్సెస్ ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’లో ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. యూపీ ఎన్నికల్లో ఎన్డీయే 42 శాతం ఓట్లు సంపాదించుకోగా.. విపక్షాలన్నీ కలిసి 55 శాతం ఓట్లు పొందాయి. దీంతో విపక్షాలన్నీ ఏకమైతే పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అనుమానాన్ని ఈ సమావేశంలో బీజేపీ చర్చించింది. దీనికి సంబంధించిన వివరాలను సంఘ్ పెద్దలకు అందజేసింది. అందు కే దళితులు, గిరిజనులను పార్టీకి దగ్గర చేసేలా ప్రణాళికలు రూపొందించాలని, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని బీజేపీ కోరింది. బీజేపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి రాంలాల్, సహ ప్రధాన కార్యదర్శులు శివప్రకాశ్ సింగ్, సౌదాన్ సింగ్, వి.సతీశ్ పాల్గొన్నారు.
‘దృష్టి’లో తెలుగు రాష్ట్రాలు
బీజేపీ ఆలోచన ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో పార్టీ క్షేత్రస్థాయి వరకు వెళ్లేలా ఆరెస్సెస్ వ్యూహాలు రచించాలని బీజేపీ కోరింది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు విపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయన్న సమాచారాన్ని బీజేపీ.. సంఘ్ పెద్దలముందుంచింది. దీనికి ప్రతివ్యూహాలను రచించాలని కోరింది. ఇప్పటికే ‘ఒకే గుడి, ఒకే శ్మశానం, ఒకే బావి’ పేరుతో కుల వివక్షలను పొగొట్టేలా గ్రామాల్లో ఆరెస్సెస్ ప్రచారం చేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్