మోదీ మిషన్.. బీజేపీ కార్యాలయంలో ఫెయిల్!
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. నిత్యం అప్‌డేట్‌గా ఉంటారు. ముఖ్యంగా తన కలల పథకం 'డిజిటల్ ఇండియా' మిషన్‌ను ప్రవచిస్తుంటారు. కానీ, ఆయన సహచరుడు అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాత్రం 'డిజిటల్ ఇండియా' స్ఫూర్తి కనిపించడం లేదు. అప్‌డేట్ అన్న ముచ్చటే బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌కు తెలియనట్టు కనిపిస్తున్నది. ఉదాహరణకు బీజేపీ ప్రధాన వెబ్‌సైట్‌లో ఆఫీస్ బేరర్ల గురించి ఆరాతీస్తే.. (http://www.bjp.org/hi/organisation/office-bearers)ను చాలాకాలంగా ఆ సమాచారాన్నే అప్‌డేట్ చేయడం లేదని తాజా పరిశీలనలో తేలింది.
బీజేవైఎం అధ్యక్షుడు ఇప్పటికీ అనురాగ్ ఠాకూరేనట!
బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఇప్పటికీ అనురాగ్ ఠాకూరేనట. ఇది బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ దర్శనమిస్తున్న విషయం. బీజేపీవైఎం అధ్యక్షురాలిగా దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని ఇప్పటికీ బీజేపీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయలేదు.
ఇక పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వినోద్ సోనకర్‌ను ఇటీవల నియమించగా.. ఆ విషయాన్ని కూడా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయలేదు. ఇప్పటికీ పాత అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతం పేరే కనిపిస్తుండటం గమనార్హం. బీజేపీ ఎస్టీ మోర్చా కొత్త అధ్యక్షుడిగా రాంవిచార్ నేతామ్‌ను నియమించగా.. వెబ్‌సైట్‌లో మాజీ అధ్యక్షుడు ఫగన్‌సింగ్ కులస్తే పేరును ఇంకా కొనసాగిస్తున్నారు. ఇతర నియామకాల విషయంలోనూ ఇదేవిధంగా బీజేపీ వెబ్‌సైట్‌ను ఏమాత్రం అప్‌డేట్ చేయకపోవడంతో సమాచారం కోసం ఈ అధికారిక సైట్‌ను ఆశ్రయిస్తున్న నెటిజన్లు విస్తుపోతున్నారు. ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. డిజిటల్ ఇండియాను ప్రవచిస్తున్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఇలా సొంత వెబ్‌సైట్ అప్‌డేట్ విషయంలో అలసత్వం వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.