న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం అఖిలభారతీయ విద్యార్థి పరిషద్ (ఏబీవీపీ) పాగా వేసింది. పోటాపోటీగా జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికలలో కాంగ్రెస్ అనుబంధ భారత జాతీయ విద్యార్థుల సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) హవాకు గండికొట్టింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ఆయన పేరుప్రఖ్యాతులను ఉపయోగించుకుంటూ సాగిన ఎన్నికల ప్రచారంతో వర్సిటీ విద్యార్థి సంఘంలోని మూడు అత్యున్నత స్థాయి పదవులను ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులను వరుసగా అమన్ అవానా, ఉత్కర్ష్ చౌదరి, రాజు రావత్ దక్కించుకున్నారు. కార్యదర్శి పదవిని మాత్రం ఎన్‌ఎస్‌యూఐకి చెందిన కరిష్మా ఠాకూర్ గెలుచుకున్నారు.