బాసులే ఎక్కువగా ఇరగదీస్తున్నారట!
బాసులే ఎక్కువగా ఇరగదీస్తున్నారట!
Published Tue, Jul 1 2014 1:55 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
లండన్: ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా ఓ వ్యసనంలా అందర్ని చుట్టేసిందంటే ఆశ్చర్య పడాల్సిన విషయమేమి కాదు. ఇల్లైనా, ఆఫీసైనా, కనీసం మొబైల్ తోకాని సోషల్ మీడియాతో కనెక్ట్ అయి చాటింగ్ చేయడం, ఫోటోలను షేర్ చేసుకోవడం అన్నివర్గాల వయస్సుల వారికి ఓ అలవాటుగా మారింది. అయితే పనివేళల్లో సాధారణ ఉద్యోగుల కంటే బాసులే ఎక్కువగా ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్ జెన్ ఓ సర్వేను నిర్వహించింది.
ఆఫీసుల్లో పని వదిలేసి.. వ్యక్తిగత పనులకు సోషల్ మీడియాను టాప్ మేనేజర్లు విరివిగా వినియోగిస్తున్నారని సర్వేలో స్పష్టమైంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్లు సోషల్ మీడియా మోజులో పడటం వలన ఉత్పత్తి తగ్గడమే కాకుండా, ఆర్ధికంగా కంపెనీలు నష్లాలకు లోనవుతున్నట్టు సర్వేలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఈ సర్వేలలో సుమారు 11 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
సీనియర్ ఉద్యోగుల కంటే యువ ఉద్యోగులే సోషల్ మీడియాను ఉపమోగించుకుంటున్నారని పరిశోధనలో తెలిసింది. ఆఫీస్ సమయంలో మహిళా ఉద్యోగుల కంటే పురుషులే వ్యక్తిగత పనులకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారట. కార్యాలయాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తే ఉద్యోగం పోతుందనే భయం కూడా ఉద్యోగుల్లో కనిపించడం లేదని తాజా సర్వే వెల్లడించింది.
Advertisement