మెదడు అతి స్పందనతోనే దురద.. గోకుడు!
దురద పుట్టినప్పుడు అక్కడ గోక్కుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదూ. కానీ ఆ తర్వాతే కాసేపటికల్లా మంట పుడుతుంది. కానీ.. అలా గోక్కోవాలి అనిపించడానికి.. మెదడు అతిగా స్పందించడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోక్కుంటున్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది గానీ, మరీ ఎక్కువగా గోకితే మాత్రం అక్కడ దురద ఇంకా పెరుగుతుందని, అలాగే నొప్పితో పాటు చర్మం మీద కూడా మచ్చలు పడతాయని ఈ అంశం మీద పరిశోధన చసిన హిడెకి మొచిజుకి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పారు. ఆయన అమెరికాలోని టెంపుల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్లోని డెర్మటాలజీ విభాగంలో పనిచేస్తున్నారు.
బాగా దురదలు ఎక్కువగా ఉండే కొంతమంది రోగులతో పాటు, పదిమంది ఆరోగ్యవంతులైన వారిని ఈ పరిశోధన కోసం తీసుకున్నారు. వారికి అత్యాధునికమైన ఎఫ్ఎంఆర్ఐ నిర్వహించి చూశారు. దురదలు ఎక్కువగా ఉండి, గోక్కునేటప్పుడు వారికి మెదడులో ఉండే మోటార్ కంట్రోల్, రివార్డ్ ప్రాసెసింగ్ భాగాలు బాగా ఉత్తేజితం అయినట్లు గుర్తించారు. ఇలా అతిగా ఉత్తేజితం కావడం వల్లే గోక్కోవాలని అనిపిస్తుందని తమ పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. వాళ్లకు దురద పుట్టడం కోసం ఈ పరిశోధన సమయంలో దురద గుంట ఆకు ఉపయోగించారు.