చైనా తల్లుల పాలు మరింత శ్రేష్ఠం
చైనాలో తల్లిపాలు తాగే పిల్లలు అమెరికా, మెక్సికో పిల్లల కంటే ఎక్కువ అదృష్టవంతులట. ఎందుకంటే.. చైనా తల్లులకు ఆరోగ్యాన్ని సంరక్షించే కరోటెనాయిడ్లు అనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. కరోటెనాయిడ్లు సాధారణంగా మొక్కల నుంచి వస్తాయి. ఇవి మానవాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి.. అలాగే విటమిన్ ఎ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోగనిరోధక వ్యవస్థను పెంచడంలోనూ ఎ విటమిన్ పాత్ర కీలకం.
పిల్లలు పుట్టిన రెండు వారాల తర్వాత తల్లిపాలలో ఉండే కరోటెనాయిడ్లను పరిశీలిస్తే.. చైనా తల్లుల పాలలో కంటే అమెరికా తల్లుల పాలలో ఇవి 40 శాతం తక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే మెక్సికన్ తల్లుల పాలలో కూడా అమెరికా వాళ్ల కంటే 25 శాతం ఎక్కువగా కరోటెనాయిడ్లున్నాయి. చైనా మెక్సికోలతో పోలిస్తే అమెరికాలో పండ్లు, కూరగాయలు తక్కువగా తినడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కరోటెనాయిడ్లు పసి పిల్లలతో పాటు తల్లులకు కూడా చాలా ముఖ్యమని పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మారియో ఫెరుజి తెలిపారు. గర్భిణులు తప్పనిసరిగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని, ముఖ్యంగా ఆకు కూరలు, పచ్చటి పండ్లు బాగా తినాలని సూచించారు.