ఆడి.. బెంజ్.. బీఎండబ్ల్యు.. ఇవే ఆ దొంగ టార్గెట్! | bunty chor, who targeted high end cars caught in delhi | Sakshi
Sakshi News home page

ఆడి.. బెంజ్.. బీఎండబ్ల్యు.. ఇవే ఆ దొంగ టార్గెట్!

Published Fri, Jul 22 2016 11:40 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

ఆడి.. బెంజ్.. బీఎండబ్ల్యు.. ఇవే ఆ దొంగ టార్గెట్!

ఆడి.. బెంజ్.. బీఎండబ్ల్యు.. ఇవే ఆ దొంగ టార్గెట్!

ఢిల్లీ పోలీసులు ఒక కార్ల దొంగను పట్టుకున్నారని మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆఫ్టరాల్ కార్ల దొంగ పట్టుబడితే ఏమవుతుందని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక రోజు తర్వాత అసలు విషయం మొత్తం బయటపడింది. అతగాడు ఆషామాషీ దొంగ కాదు. కేవలం హై ఎండ్ కార్లను మాత్రమే దొంగిలిస్తాడు. అతగాడి చెయ్యి పడాలంటే అది కనీసం ఏ బెంజో, బీఎండబ్ల్యునో, ఆడి కారో అయ్యుండాలి. అంతటి పెద్ద దొంగ అన్న మాట. అతడి వయసు కేవలం 27 ఏళ్లు. పేరు రాబిన్ అలియాస్ రాహుల్. ఇంతకీ కార్లను ఎందుకు దొంగిలిస్తాడో తెలుసా.. గర్ల్ఫ్రెండ్లను ఇంప్రెస్ చేయడానికే! తాజాగా ఢిల్లీ పశ్చిమవిహార్ ప్రాంతంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ వద్ద బీఎండబ్ల్యు కారును దొంగిలించి తీసుకెళ్లి,  దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడివద్ద ఉన్న ఒక బీఎండబ్ల్యు, ఒక టయోటా ఫార్చూనర్ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

బాలీవుడ్ సినిమా ‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’ సినిమా చూసి తాను స్ఫూర్తి పొంది ఇలా దొంగతనాలు చేస్తున్నానని చెప్పాడు. ఆ సినిమాలో ‘బంటీ చోర్’ పాత్ర పోషించిన నటుడి ఫొటోను కూడా రాహుల్ తన జేబులో పెట్టుకున్నాడు. చాలా విలాసవంతమైన జీవితం గడుపుతాడని, తరచు ఢిల్లీలోని పబ్లు, మాల్స్ వద్ద కనిపిస్తాడని పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు అతడు దొంగిలించిన కార్లలో ఆడి, బీఎండబ్ల్యు, ఫార్చూనర్, మెర్సిడెస్, స్కోడా లాంటి కార్లు ఉన్నాయి. తెల్లవారుజామున యజమానులు మార్నింగ్ వాక్ కోసం వెళ్లినపుడు ఇంట్లో ప్రవేశించి, కారు తాళాలు తీసుకుని మరీ కారు తీసుకెళ్తాడట. ఢిల్లీతో పాటు హరియాణా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ ఇతడు తన చేతివాటం చూపించాడు. అతడు బీఎండబ్ల్యు, ఆడి కార్లను దొంగతనం చేసి తీసుకెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పోలీసులు పట్టుకోగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement