వచ్చే ఏడాది కల్లా రెండంకెల వృద్ధిరేటు | By next year double-digit growth | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది కల్లా రెండంకెల వృద్ధిరేటు

Published Thu, Sep 24 2015 2:56 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

వచ్చే ఏడాది కల్లా రెండంకెల వృద్ధిరేటు - Sakshi

వచ్చే ఏడాది కల్లా రెండంకెల వృద్ధిరేటు

- ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ:
వచ్చే ఏడాది కల్లా ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు  ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రం పదిహేను నెలల పసికందే అయినప్పటికీ రెండో ఏడాది మొదటి త్రైమాసికంలో 9.72 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. ఆయన సమక్షంలో వివిధ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా సందర్భాల్లో సీఎం మాట్లాడారు.
 
ఒప్పందాలు ఇవీ..
- చైనా కంపెనీ జియాన్ లాంగ్ ఐ సిలికాన్ మెటీరియల్స్ కార్పొరేషన్ మొత్తం రూ. 8 వేల కోట్ల పెట్టుబడుల అంచనాలో తొలివిడతగా రూ. 1670 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో సోలార్ సెల్ అండ్ మాడ్యుల్ ప్రొడక్షన్ యూనిట్ నెలకొల్పనుంది. ఇందుకు సంబంధించి లాంగ్‌ఐ చైర్మన్ బాషెన్ జాంగ్, రాష్ట్ర మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్ జైన్ సంతకాలు చేశారు. ఇదే అంశంలో మరో ఒప్పందానికి సంబంధించి శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, లాంగ్‌ఐ చైర్మన్ సంతకాలు చేశారు.  
- ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు (ట్రాన్స్‌కో, జెన్‌కో) కేంద్ర గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) రూ. 9 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై ట్రాన్స్‌కో, ఆర్‌ఈసీ సీఎండీలు విజయానంద్, రాజీవ్ శర్మ బుధవారం న్యూఢిల్లీలో సంతకాలు చేశారు. ఈ రుణంలో రూ. 6 వేల కోట్లు రాజధాని అమరావతి విద్యుత్ అవసరాలకే వినియోగిస్తారు. మరో రూ. 3 వేల కోట్లను అనంతపురం జిల్లాలో ఏపీ జెన్‌కో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్రాజెక్టుకు వినియోగిస్తారు.
 
ఢిల్లీలో బిజీగా గడిపిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో ఉదయం అల్పాహార భేటీ జరిగింది.  ఈ సందర్భంగా వెంకయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బాబుతో భేటీలో స్వచ్ఛభారత్ అంశాలు తప్పితే రాజకీయాలు మాట్లాడలేదన్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపామని, కేబినెట్ ఆమోదం పొందేలోపు టెండర్లు నిర్వహించాలని రాష్ట్రానికి తెలిపామన్నారు. కేంద్ర మంత్రి అశోక గజపతి రాజును కలిసి రాష్ట్రంలో ఆధునీకరణ, కొత్త సర్వీసుల ఏర్పాటు తదితర అంశాలపై బాబు సమీక్షించారు.

బాబుతో భేటీ అనంతరం అశోక గజపతి రాజు విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నానికి సమాంతరంగా బోగాపురంలో రన్‌వే ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, రక్షణ శాఖ నుంచి స్పష్టత లభించాల్సి ఉందన్నారు.  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో బాబుతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. సెక్షన్ 8 అమలు తదితర అంశాలపై చర్చించారు.  కేంద్రం వద్ద పెండింగులో హామీలు నెరవేర్చేలా జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను కోరినట్టు తెలుస్తోంది.
 
రైతాంగానికి అండగా ఉంటాం: రాధా మోహన్‌సింగ్
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో సహాయాన్ని అందించామని, రాష్ట్ర విపత్తు నిధిని ఒకటిన్నరెట్లు పెంచామన్నారు. సీఎం చంద్రబాబు బుధవారం ఇక్కడ తనను కలిసిన అనంతరం మంత్రి రాధా మోహన్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. ఏపీలో మత్స్యపరిశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు తొలి విడత నిధులు మంజూరు చేశామని తెలిపారు.
 
రైతు ఆత్మహత్యలు తక్కువగానే ఉన్నాయి
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తక్కువగానే ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. బాధిత రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. రాధామోహన్‌సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement