ట్రంప్‌కు ఓటేశాడని ఎంత పనిచేసింది..!
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ఎలిమెంటరీ స్కూల్లో నిర్వహించిన మాక్ ఎలెక్షన్‌లో ఓ విద్యార్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసినందుకు అతని తల్లి ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, విద్యార్థి తల్లి వివరాలు తెలియరాలేదు. మొబైల్‌తో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడిని హింసించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టెక్సాస్‌లోని ఓ స్కూల్లో మాక్ ఎలెక్షన్ నిర్వహించగా ఆ చిన్నారి ట్రంప్‌కు ఓటేశాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అతని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విద్యార్థి దుస్తులను సూట్ కేసులో సర్ది దాన్ని డోర్ దగ్గరకు విసిరేసింది. ట్రంప్‌కు ఓటు వేసినందుకు ఇంట్లో ఉండొద్దని, బయటకు వెళ్లిపోమంటూ ఆ చిన్నారిని దూషించింది. ఇంట్లోంచి వెళ్లనంటూ ఆ విద్యార్థి ఏడుస్తూ డోర్ వద్ద నిలబడ్డాడు. ఆమె సూట్ కేసు బయటకు విసిరి, అతన్ని ఇంట్లోంచి బయటకు నెట్టి డోర్ వేసింది. మళ్లీ ఇంట్లోకి రావద్దని హెచ్చరించింది. ఆ చిన్నారి ఏడుస్తూ సూట్ తీసుకుని రోడ్డుపైకి వెళ్లాడు.
ది ఫోర్ట్ బెండ్ కౌంటీ షెరిఫ్ ఆఫీసు ఈ ఘటనపై విచారణ చేపట్టింది. చిన్నారిని బయటకు పంపిన మహిళ ఎవరన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఈ వీడియో అంతా ఓ జోక్ అని ఆమె అధికారులకు చెప్పింది. అయితే దీన్ని తాము జోక్‌గా భావించడం లేదని, తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు చెప్పారు.