
కారులో అత్యాచారయత్నమంటూ మహిళ ఫిర్యాదు
నడుస్తున్న కారులో ఓ యువతిపై అత్యాచారానికి యత్నించిన ముగ్గురు వ్యక్తులను ఘట్‌కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదారాబాద్ నుంచి వరంగల్ వస్తున్న క్యాబ్‌లో తనపై అత్యాచారయత్నం చేయబోతున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వేగంగా స్పందించారు.
ఘట్‌కేసర్ దగ్గర క్యాబ్‌ను అడ్డుకుని మహిళను రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉండే మహిళ భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత సంబంధం ఉన్నట్లు సమాచారం.
అయితే ఆ మహిళ ఖాజీపేటలోని గణేష్ టెంపుల్‌కు ఒంటరిగా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తన స్నేహితుల క్యాబ్‌లో వెళ్లి ఆమె తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఎందుకు వెళ్లావు, ఎవరిని కలవడానికి వెళ్లావంటూ ఆమెను కొట్టాడు. దీంతో ఆమె తనపై అత్యాచారయత్నం జరుగుతోందంటూ మెసేజ్ పెట్టిందని పోలీసులు విచారణలో తేల్చారు. మహిళను కొట్టినందుకు శ్రీకాంత్, అతని స్నేహితులపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.