వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ బస్టాపులోకి కారు దూసుకురావడంతో ఇద్దరి మృతి.
ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు
హైదరాబాద్: స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాపులో నిలిచి ఉన్న వారిపైకి ఓ కారు మృత్యువులా దూసు కొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భాగ్యమ్మ తన కారు (ఏపీ 29బీపీ 3677)లో బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్తోంది. ఈ క్రమంలో ఇంజాపూర్ కమాన్ దాటిన తరువాత కారు అదుపుతప్పి బస్టాపులోకి దూసుకుపోయింది.
ఈ సంఘటనలో బస్టాపులో ఉన్న ఇంజాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య(70) అక్కడికక్కడే మృతి చెందగా, మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగమ్మ (60) తీవ్రంగా గాయపడింది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చని పోయింది. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన మరో మహిళ అనితకు స్వల్ప గాయాలయ్యాయి. జంగమ్మ, అనిత తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.