కస్టమ్స్ ఆఫీసర్ లాకర్లో రూ. 85 లక్షల నగదు!
కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నారంటే కష్టాలు తీరినట్లే అంటారు. అది నిజమనిపించేలా.. ఓ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బ్యాంకు లాకర్లో భారీ మొత్తం నగదు బయటపడింది. సీబీఐ సోదాలు చేస్తే, అంతా ఇంతా కాదు.. ఏకంగా 85 లక్షలు దొరికాయి. ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు.. భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ లాకర్లు చూస్తే, వాటిలో 85 లక్షల నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి.
దాంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. సహదేవ్ గుప్తా అనే వ్యాపారి 8 వేల కోట్ల లావాదేవీలు చేసి, వాటి విషయంలో తప్పించుకోడానికి ఈ అధికారి సాయం తీసుకున్నట్లు సీబీఐ చెబుతోంది. ఆయన సాయం చేయడం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 75 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు అందడంతో కస్టమ్స్ కమిషనర్ అతుల్ దీక్షిత్, డిప్యూటీ కమిషనర్ నళిన్ కుమార్ ఇద్దరి లాకర్లను తనిఖీ చేశారు. దీక్షిత్ లాకర్లలో 85 లక్షల నగదుతో పాటు గుర్గావ్, గ్రేటర్ నోయిడా, లక్నో తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు పత్రాల్లో గుర్తించారు.