
తీస్తా సెతల్వాద్ ఆఫీసులపై సీబీఐ దాడులు
ముంబై: కేంద్ర హోం శాఖ అనుమతి పొందకుండా విదేశీ విరాళాలను స్వీకరించారంటూ.. గోద్రా అల్లర్ల బాధితుల తరఫున పోరాడుతున్న హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు చెందిన ఆఫీసులపై సీబీఐ దాడులు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరు రోజుల కిందట కేసు నమోదుచేసిన సీబీఐ మంగళవారం సెతల్వాద్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌కు చెందిన గులాం మొహమ్మద్ పెషిమామ్, సబ్‌రంగ్ కమ్యూనికేషన్, పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులపై దాడులు జరిపింది.
కేంద్రం అనుమతి లేకుండా సబ్‌రంగ్ ఫోర్డ్ ఫౌండేషన్(అమెరికా) నుంచి సుమారు రూ.1.8 కోట్లు విరాళంగా పొందినట్లు సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. తాము విచారణకు పూర్తిగా సహకరిస్తామని లేఖ రాసినప్పటికీ సీబీఐ ఇలా ఆకస్మిక దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందని సెతల్వాద్ ఆరోపించారు.