
సెల్‌కాన్ ఫోన్లలో తెలుగు
సంక్షిప్త సందేశాలతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి అప్లికేషన్లను తెలుగులో వినియోగించుకునే వీలున్న సెల్‌ఫోన్లను సెల్‌కాన్ ఆవిష్కరించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంక్షిప్త సందేశాలతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి అప్లికేషన్లను తెలుగులో వినియోగించుకునే వీలున్న సెల్‌ఫోన్లను సెల్‌కాన్ ఆవిష్కరించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా మంగళవారమిక్కడ వీటిని విడుదల చేసింది. రానున్న రోజుల్లో 90 శాతంపైగా మోడళ్లలో తెలుగు భాషను నిక్షిప్తం చేస్తామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా చెప్పారు. ఫోన్లన్నీ ఇంగ్లీషులో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఎస్‌ఎంఎస్‌లు, యాప్స్ వాడకం తెలియడం లేదని, ఈ కారణంగానే గ్రామాల్లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పారాయన. రూ.1,000లోపు ధరలో ఉన్న మోడల్‌లో కూడా తాము తెలుగును ప్రవేశపెట్టామని, ఇది ఒకరకంగా సంచలనమేనని వ్యాఖ్యానించారు. హిందీ, తమిళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మలయాళం భాషల సాఫ్ట్‌వేర్లను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే సెల్‌కాన్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారు స్థానిక భాషలు కావాలంటే సర్వీసింగ్ కేంద్రానికి వెళ్లాలి.
దూసుకెళ్తున్న స్మార్ ్టఫోన్ల వాటా..
సెల్‌కాన్ ప్రస్తుతం నెలకు 6 లక్షల సెల్‌ఫోన్లను విక్రయిస్తోంది. ఆదాయంలో స్మార్ట్‌ఫోన్ల వాటా 50 శాతంగా ఉంది. డిసెంబరు నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. పరిమాణం ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 40 శాతానికి ఎగబాకుతుందని గురు తెలిపారు. తెలుగు నిక్షిప్తమైన ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీచర్ ఫోన్లలో కూడా జీపీఆర్‌ఎస్, వాట్సాప్‌ను పొందుపర్చనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరిలో దుబాయిలో అడుగు పెడుతున్నామని తెలియజేవారు.
ప్లాంటుకు తోడ్పాటు: పొన్నాల
అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటుకు సెల్‌కాన్ ముందుకు వస్తే తగు ప్రోత్సాహమిస్తామని పొన్నాల హామీ ఇచ్చారు. సెల్‌ఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నామని సెల్‌కాన్ ప్రతినిధులు చెప్పగా.. ముందు మీరు ప్లాంటు ప్రారంభించండి, కావాల్సిన సహాయం చేస్తామంటూ మంత్రి పేర్కొన్నారు.