ఢిల్లీలో కాళ్లు పట్టుకోలేదా? | chandra babu holds the patent for sabotage, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాళ్లు పట్టుకోలేదా?

Published Fri, Jun 19 2015 3:02 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

ఢిల్లీలో కాళ్లు పట్టుకోలేదా? - Sakshi

ఢిల్లీలో కాళ్లు పట్టుకోలేదా?

అసలు కుట్ర పుట్టిందే తెలుగుదేశం పార్టీలోనని, చంద్రబాబు నాయుడి దగ్గర్నుంచేనని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. మీకే దాని సంగతి తెలుసని, అసలు కుట్రకు పేటెంటు చంద్రబాబు దగ్గరే ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోను, మంత్రి హరీశ్ రావుతోను కుట్ర పన్నారంటూ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలకు కౌంటర్గా వైఎస్ఆర్ సీపీ.. చంద్రబాబుకు, టీడీపీకి 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని సవాల్ విసిరింది.
 

సుజనా చౌదరిని ఢిల్లీ పంపి.. అక్కడ కేటీఆర్ కాళ్లు పట్టించిన మాట వాస్తవం కాదా అని బొత్స అడిగారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టకునేందుకు సిద్ధమైన మాట నిజం కాదా అని నిలదీశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను ఉపయోగించి ఎన్డీయే పెద్దలందరినీ ప్రాధేయపడ్డారన్నారు. ఇక గవర్నర్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అసలెందుకు ఇలాంటి పరిపాలన చేస్తారు.. ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, రాష్ట్రానికి సంబంధించి ఆయనతో ఏమైనా ఇబ్బంది ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవాలనే తాము చెప్పామని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఒకరేమో గంగిరెద్దు అని, మరొకరేమో ధ్రుతరాష్ట్రుడని వ్యాఖ్యానించారన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాత్రం ఎవరినీ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటున్నారని.. అంటే రాజీ చేసుకుందామనా అని ప్రశ్నించారు. సెక్షన్ 8 అప్పుడే అమలు జరిగిపోయిందా.. ఎందుకు తగ్గారని నిలదీశారు. తప్పులన్నీ మీదగ్గర పెట్టుకుని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి కుట్ర అంటారా అంటూ మండిపడ్డారు.

పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 50 లక్షల లంచం ఇచ్చి, దేశ ప్రజలందరూ టీవీలలో చూస్తుండగా పట్టుబడి మళ్లీ ఏం మాట్లాడుతున్నారని కడిగేశారు. ఆంధ్రప్రదేశ్కు తలవంపులు తెచ్చారని, పరిపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులు అల్లాడిపోతున్నారని, వాళ్లకు కనీస మద్దతుధరను కేవలం రూ. 50 మాత్రమే పెంచినా దానిమీద కనీస స్పందన కూడా లేదని అన్నారు.  సంక్షేమం దూసుకెళ్లిపోతోందని చెబుతున్నారని.. కానీ అవినీతిలోనే సర్కారు దూసుకుపోతోందని మండిపడ్డారు.

మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్నారని, నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారని,. అవి ఎక్కడ చేశారని.. మీ సంక్షేమం ఏమైందని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందన్నారు... జరిగితే పట్టుకోండి కానీ కట్టిన వాళ్లకు బిల్లులు ఇవ్వలేదని, కొత్తగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఓటుకు నోటు కార్యక్రమం వల్ల వంద రోజులుగా పాలన లేకుండా పోయిందన్నారు. నిన్న పట్టిసీమ చూద్దామని వెళ్లినప్పుడు పక్కనే పోలవరం ఉంటే ఒక కన్నైనా అటువైపు వేశారా, అటు చూశారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement