జయదేవ్ మాత్రమే మాట్లాడాలట!
ఇక నుంచి జాతీయ మీడియాతో పార్టీలో ఎవరు పడితే వారు మాట్లాడటానికి వీలులేదని చంద్రబాబు నేతలకు హుకుం జారీ చేశారు. అదేంటి అలా కట్టడి విధించడమేంటా? అని ఆరా తీసిన నాయకులకు అసలు విషయం తెలిసింది. గోదావరి పుష్కరాల తొలి రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార కాంక్ష వల్ల 30 మంది పుష్కర యాత్రికులు మరణించారు.
ఈ ఘటన ఏపీ ప్రభుత్వ పరువును జాతీయ స్థాయిలో మసకబార్చింది. జాతీయ టివీ చానళ్లు ఇదే అంశంపై చర్చను చేపట్టాయి. వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఈ చర్చల సందర్భంగా టీడీపీ నేతలు, మంత్రులను వ రుస పెట్టి శరపరంపరగా వచ్చిన ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. వచ్చీరాని ఆంగ్ల భాషతో మరింత ఇబ్బంది పడ్డారు.
ఒకానొక సందర్భంలో వితండవాదన చేసి నవ్వుల పాలయ్యారు. ఈ చర్చల సరళిని పార్టీ వర్గాలు అధినేత చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇచ్చారు. దాంతో పరువు తీశారంటూ సణుక్కున్న చంద్రబాబు ఇలాంటి చర్చాగోష్టుల్లో గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాత్రమే మాట్లాడాలని ఆదేశించారట. ఆయనొక్కరే ఎందుకు మాట్లాడాలని ఒకరిద్దరు ఎంపీలు మనస్సు ఉండబట్టలేక ప్రశ్నిస్తే ఆయనకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం మీకంటే బాగా ఎక్కువగా ఉంది, జాతీయస్థాయి మీడియాకు ఇక ఆయనే బ్రీఫింగ్ ఇస్తారన్నారట.!