
రంగా హత్య వెనుక బాబు హస్తం!
'60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో
మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు
* బాబు ప్రోద్బలంతోనే ఆ దారుణహత్య జరిగింది
* రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది
* నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు
* రంగాను బతకనిస్తే టీడీపీకి మనుగడ ఉండదని కొందరు చంద్రబాబును ఆశ్రయించారని తెలిపారు
* అతడ్ని అంతమొందించేందుకు అనుమతివ్వాలని కోరగా.. చంద్రబాబు పచ్చజెండా ఊపారని చెప్పారు
* ఆ తరువాత వారం రోజులకే రంగా దారుణహత్య వార్త వినాల్సి వచ్చింది
* ఇందులో చంద్రబాబునాయుడు పాత్ర రుజువైంది
* నాడు వంగవీటి మోహనరంగాకు భద్రత ఇవ్వకుండా అడ్డుకున్నదీ చంద్రబాబే
సాక్షి ప్రతినిధి, ఏలూరు
రెండున్నర దశాబ్దాల కిందట రాష్ట్ర రాజకీయాల్ని ఒక్క కుదుపు కుదిపిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తముందని, ఆయన ప్రోద్బలంతోనే ఆ దారుణహత్య జరిగిందని అందులో పేర్కొన్నారు. రంగాకు నాడు భద్రతను పునరుద్ధరించకుండా అడ్డుకున్నదీ చంద్రబాబేనని తెలిపారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న తనకు వంగవీటి రంగా హత్య గురించి ముందుగానే తెలిసిందన్నారు. రంగాను బతకనిస్తే పార్టీకి మనుగడ ఉండదని, అతడ్ని అంతమొందించేందుకు అనుమతివ్వాలంటూ నాడు విజయవాడకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మిక సంఘ నేత ప్రభాకరరాజు పార్టీ నేతలతో కలసి చంద్రబాబు నాయుడును ఆశ్రయించగా.. ఆయన పచ్చజెండా ఊపారని తనకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు... రంగా హత్యకు వారం రోజులముందు తనతో చెప్పారని జోగయ్య తన పుస్తకంలో వివరిం చారు.
శివరామరాజు చెప్పినట్టే ఆ తరువాత వారం రోజులకు రంగా దారుణహత్య వార్తను వినాల్సి వచ్చిందని తెలిపారు.'అరవై వసంతాల రాజకీయ ప్రస్థానం'పేరిట జోగయ్య రచించిన ఆ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. కాగా 150 పేజీల పుస్తకంలో జోగయ్య తన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో విశేషాలను, వివాదాలను, విషాదాలను, మలుపులను ప్రస్తావించారు. ఆ క్రమంలో 71, 72, 73 పేజీల్లో కాపునాడు కలతలు శీర్షికన రంగా హత్యోదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన రాసిన మాటల్లోనే..
విజయవాడలో'మహానాడు'విజయవంతంగా ముగిసిన కొద్దినెలలకే అదే ప్రాంగణంలో కాపు సామాజికవర్గ నేతలు కాపునాడు నిర్వహించారు. లక్షమందికిపైగా కాపు కులస్తులు హాజరైన ఆ సభలో కాపు నాయకులు ఎన్టీఆర్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. దీంతో కలత చెందిన ఎన్టీఆర్ నన్ను పిలిచి.. ఎందుకు మీ వాళ్లంతా(కాపుకులస్తులు) నన్ను వ్యతిరేకిస్తున్నారు? కారణమేమిటీ? అని అడిగారు. దానికి సమాధానంగా నేను'ఈ మధ్యకాలంలో కాపు కులస్తులకు మన ప్రభుత్వంపై కోపం రావడానికి ముఖ్య కారణం తమ కులస్తుడైన విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతను ఉపసంహరించడమేనని చెప్పాను. రంగాకు భద్రతను పునరుద్ధరిస్తే అసంతృప్తి తగ్గుతుందని చెప్పాను. ఆ సూచనను ఆయన ఆమోదించి అలానే చేస్తానన్నారు. కానీ మరునాటి ఉదయం కలసినప్పుడు 'సారీ జోగయ్యగారు.. మీ సలహా ప్రకారం చేయలేకపోతున్నాను. చంద్రబాబు తదితరులు ఇప్పుడే మార్పులు చేయొద్దు.. పరిస్థితి యథాతథంగా కొనసాగించడమే మంచిదంటున్నారు'అని అన్నారు ఎన్టీఆర్. సరే మీ ఇష్టం అని ఊరుకున్నాను.
హత్యకు ముందే నాకు సమాచారమొచ్చింది...
ఆ తర్వాత కొద్దిరోజులకు నాకు బాగా సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే దండు శివరామరాజు నాతో చెప్పిన మాట ఏమిటంటే... 'ఇక వంగవీటి రంగా ఎన్నాళ్లో బతికేటట్టు లేడు. అతడిని అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయమైన సమాచారం అందింది' అన్నారు. దానిని నేను నమ్మకపోవడంతో 'విజయవాడ వాస్తవ్యుడు రైల్వే కార్మికసంఘ నాయకుడు(ప్రభాకరరాజు) నాకీ సమాచారమిచ్చాడు. ఆ వ్యక్తి సిరీస్ సుబ్బరాజుకు మిక్కిలి సన్నిహితుడు. నాకు కూడా బాగా సన్నిహితుడు కాబట్టి నమ్మాలి'అని శివరామరాజు అన్నారు.
రంగా బతికితే టీడీపీకి మనుగడ లేదన్నారు
విజయవాడకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మికసంఘ నేత ప్రభాకరరాజు కొందరు పార్టీ వాళ్లతో ఎన్టీఆర్‌ని కలసి..'రంగాను బతకనిస్తే విజయవాడలో మన పార్టీకి మనుగడ లేదు. అతణ్ణి అంతమొందించేందుకు మాకు అనుమతివ్వండి'అని అడిగితే ఎన్టీఆర్'అటువంటివి తనకిష్టం లేదని'కరాకండీగా చెప్పడంతో వాళ్లు చంద్రబాబు, ఉపేంద్రలను ఆశ్రయించారని, వాళ్ల ప్రతిపాదనకు వారిరువురూ పచ్చజెండా ఊపారని ప్రభాకరరాజు తనతో చెప్పినట్టు శివరామరాజు చెప్పారు. రంగా హత్యకు జరిగిన కుట్ర వెనుక చంద్రబాబు, ఉపేంద్ర, సిరీస్ సుబ్బరాజు గార్ల హస్తాలు ఉన్నాయని శివరామరాజుగారు నాతో అన్నారు. తర్వాత వారం రోజులకే రంగా హత్య వార్త వినవలసి వచ్చింది. నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను శిబిరంలోనే అతి కిరాతకంగా హతమార్చారు. విజయవాడ అట్టుడికిపోయింది. తెలుగుదేశంపార్టీ వారు ఒక కాపు నాయకుడ్ని తమకు వ్యతిరేకపార్టీలో ఉండి జనాదరణ పొందుతున్నాడన్న కారణంతో పైశాచికంగా హతమార్చడం నన్ను కలిచివేసింది. ఈ వివరాలను నేనిప్పుడు కొత్తగా చెప్పడం లేదు. ఆ రోజులలోనే అనేక పబ్లిక్ మీటింగులలో, పత్రికా సమావేశాలలోనూ ప్రకటించాను.
నేను ఏదైతే రాశానో దానికి కట్టుబడి ఉన్నా: హరిరామజోగయ్య
పుస్తకావిష్కరణ తర్వాత అందులో పేర్కొన్న అన్ని విషయాలకంటే ఎక్కువగా రంగా హత్యోదంతం.. చంద్రబాబు పాత్ర ప్రస్తావన చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆదివారం రాత్రి జోగయ్యతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడగా.. 'నేను ఏదైతే రాశానో దానికి కట్టుబడి ఉన్నాను. నేను వాస్తవాలే రాశాను. ఇన్నాళ్ల తర్వాత అబద్ధం రాస్తే నాకేం వస్తుంది?'అని ఆయన అన్నారు.
ఆ కేసును పునర్విచారణ చేపట్టాలి
మా నాన్న హత్య కేసును పునర్విచారణ చేపట్టాలి. హత్య తర్వాత సుమారు పుష్కరకాలంపైగా సాగిన సీబీఐ విచారణ అసమగ్రంగా పూర్తయింది. ఇప్పటికీ సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి. నిజాయితీగా విచారణ చేపడితే అసలు నిందితులు బయటికొస్తారు. ఆ కేసులో చంద్రబాబుదే ప్రధానపాత్ర అని ఎవరైనా చెబుతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా స్పందించి రంగా హత్య కేసును పునర్విచారణకు ఆదేశించాలి.
-వంగవీటి రాధా, రంగా తనయుడు
ముమ్మాటికే బాబుదే ఆ పాపం..
ముమ్మాటికీ ఆ పాపం చంద్రబాబుదే. ఇది ఇప్పుడు మేము అంటున్న మాట కాదు. హత్యకు సరిగ్గా 24 గంటలకు ముందు స్వయంగా రంగానే.. చంద్రబాబు అండ్ కో తన హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే లేఖను కేంద్ర హోంమంత్రికి కూడా పంపారు. ఆ లేఖ అందేలోపే ఆయన దారుణహత్యకు గురయ్యారు. జోగయ్య రాసింది అక్షరాలా వాస్తవం.
- వంగవీటి రత్నకుమారి, రంగా సతీమణి