
వెన్నుపోటు యాత్రగా పేరు పెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు తన మామ ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటుపొడిచి ముఖ్యమంత్రి సీటును ఆక్రమించిన సెప్టెంబర్ 1వ తేదీనే బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారని, అందువల్ల ఆత్మగౌరవ యాత్రకన్నా ‘వెన్నుపోటు యాత్ర’ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని వైఎస్‌ఆర్‌సీపీ నేత శోభానాగిరెడ్డి సూచించారు. కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్న నిమ్స్ వద్దకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వానికి బ్లాంక్ చెక్‌లాగా లేఖ అందించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏ ముఖంతో సీమాంధ్రలో అడుగుపెడతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్న తరువాతే సీమాంధ్రలో అడుగుపెట్టాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు మళ్లీ ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు యాత్రల పేరుతో ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన అనుభవం రాష్ట్ర విభజన చేయడానికి పనికొచ్చిందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాతే సీమాంధ్రలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. మాయమాటల ద్వారా యాత్రకు వచ్చే చంద్రబాబు నిలదీసేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు దీక్ష చేసిన సమయంలో చురుగ్గా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ దీక్ష విషయంలో మొండి పట్టుదలగా, నిరంకుశంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిన నేపథ్యంలో మానవతా దృక్పథంతోనైనా స్పందించివుంటే బాగుండేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్లే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయనే విషయం గుర్తెరగాలని వారు స్పష్టంచేశారు.