అడ్డగోలు ప్రామిస్‌లతో మేనిఫెస్టోను రెడీ చేస్తున్న చంద్రబాబు
ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం.. ‘నో’ అంటే ఆయన ఫొటోతో..
సిద్ధం సభలు, బస్సు యాత్ర సక్సెస్‌తో కూటమి వెన్నులో వణుకు
సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటున్న విశ్లేషకులు.. మళ్లీ ‘‘ఫ్యాన్’’ ప్రభంజనమేనని 20కిపైగా జాతీయ\ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేల్లో వెల్లడి
2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటికొచ్చిన హామీలిచ్చిన బాబు
రుణమాఫీ అంటూ రైతులకు, మహిళలకు టీడీపీ వెన్నుపోటు
జనం నిలదీస్తారనే భయంతో వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టో మాయం
కాంగ్రెస్ హామీలకే సూపర్ సిక్స్ ముసుగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన.. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలో నీరుగారిపోయిన వైనం.. బాబు మోసాలతో హామీలను పట్టించుకోని ప్రజలు
జనసేన, బీజేపీతో జట్టు కట్టినా జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన
సీఎం జగన్‌ను తూలనాడే క్రమంలో పవన్‌పై నోరుజారడమే బాబు ఫ్రస్టేషన్‌కు నిదర్శనం
తన దగ్గర పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ భువనేశ్వరి బూతు పురాణం
సాక్షి, అమరావతి: జనసేన, బీజేపీతో జట్టుకట్టినా ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలవికాని బోగస్ హామీలు గుప్పించేందుకు సన్నద్ధమయ్యారు. గతేడాది మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ముసుగుతో మినీ మేనిఫెస్టో అంటూ ప్రకటించారు.
ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడం.. చంద్రబాబు అంటేనే మోసాలకు మరోపేరు అని ప్రజలు గుర్తించడంతో ‘సూపర్ సిక్స్’ను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు తరహాలో బోగస్ హామీలతో మేనిఫెస్టోను వదిలేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే జనం పొరపాటున కూడా నమ్మరని పసిగట్టిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో దాన్ని విడుదల చేయించేందుకు ఎత్తులు వేస్తున్నారు.
ముఖచిత్రాన్ని మార్చేసిన ‘సిద్ధం’ సభలు, బస్సు యాత్ర..
సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు తాడేపల్లిగూడెంలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నిర్వహించిన జెండా సభ, ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవకాశవాద పొత్తును జనం ఛీకొట్టారనడానికి జెండా సభ, చిలకలూరిపేట సభ నిదర్శనంగా నిలిస్తే.. సీఎం జగన్‌పై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ‘సిద్ధం’ సభలు నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ఏ ప్రాంతంలోనూ జన స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి ఈ నెల 24 వరకూ 23 జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
తీవ్ర ఫ్రస్టేషన్‌తో ఊగిపోతున్న బాబు..
సీఎం జగన్ బస్సు యాత్ర సృష్టించిన ప్రకంపనలతోపాటు ఏకంగా 20కిపైగా జాతీయ మీడియా సంస్థలు, పొలిటికల్ కన్సెల్టెన్సీలు నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని తేల్చిచెప్పడంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో నైరాశ్యం నెలకొంది.
నామినేషన్ల ఘట్టంలోనే కాడి పారేస్తున్నాయి. తీవ్ర ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ)తో సీఎం జగన్‌పై నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల విజయనగరంలో ప్రజాగళం సభలో సీఎం జగన్‌ను తూలనాడే క్రమంలో.. నెత్తిపై రూపాయి పెడితే పైసాకు కొనుక్కోవడానికి కూడా పవన్ కళ్యాణ్ పనికి రారంటూ చంద్రబాబు తన మనసులో మాట బయట పెట్టడమే అందుకు నిదర్శనం.
ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి తన వద్ద పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బూతుపురాణం వల్లించడం వారి ఫ్రస్టేషన్‌కు పరాకాష్ట. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుండటం చూస్తే వారిలో ఫ్రస్టేషన్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
అప్పటిలాగే బోగస్ హామీలతో ఇప్పుడూ..
విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీలతో జట్టుకట్టిన చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానంటూ నాడు 650కిపైగా అలవికాని హామీలిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫోటోలను ముద్రించిన పత్రంతో ముఖ్యమైన హామీలంటూ తన సంతకం చేసి మరీ ఇంటింటికీ పంపి ప్రచారం చేయించారు. అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఎన్నికల మేనిఫెస్టోను ఏకంగా టీడీపీ వెబ్‌సైట్ నుంచి చంద్రబాబు మాయం చేయించారు.
ఇప్పుడూ అదే కూటమిగా జట్టు కట్టిన చంద్రబాబు 2014 తరహాలోనూ బోగస్ హామీలతో మరోసారి ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే ప్రజలు ఛీకొడతారని గుర్తించడంతో మే 3వ తేదీన రాష్ట్రంలో నిర్వహించే సభలో ప్రధాని మోదీతో విడుదల చేయించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనం ఖాయం
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సీఎం జగన్ బస్సు యాత్ర సమూలంగా మార్చేసిందని.. పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్‌సీపీ విజయం లాంఛనమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ, కూటమి అభ్యర్థులు తేలాక జాతీయ మీడియా సంస్థలు, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20 సర్వేల్లో ‘‘ఫ్యాన్’’ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేల్చాయి.
సీ–ఓటర్ సర్వే ఒక్కటి మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే సీ–ఓటర్ నిర్వహించే సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత ఉండదు. 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ పేర్కొనగా ఆ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ ఢంకా భజాయిస్తే వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment