తుస్సుమన్న టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ
6 లక్షల మంది వస్తారని ఊదరగొట్టిన నేతలు
కిందా మీదా పడి 40–50 వేల మందికే పరిమితం
పొత్తుకు తమ మద్దతు లేదని స్పష్టం చేసిన ఇరు పార్టీల కేడర్
రెండు పార్టీలకు పట్టున్న జిల్లాలో సభ పెట్టినా నిరాశే
తక్కువ స్థలంలో జనం కిక్కిరిసేలా చేసి పోటెత్తినట్లు చూపాలని వ్యూహం
ఆ మేరకు కూడా ఆయా పార్టీల శ్రేణులు రాక బెడిసిన స్కెచ్
ఖాళీగా కనిపించిన సగం గ్యాలరీలు.. బాబు ప్రసంగానికి స్పందన కరువు
ఆరు లక్షల మందన్నారు.. సిద్ధం సభలను మించి జనం కదిలివస్తారని ఊదరగొట్టారు.. ఈ సభకు హాజరయ్యే జనసందోహంతో అధికార పార్టీ దిమ్మ తిరిగిపోతుందని పగటి కలలుగన్నారు.. అందుకే రెండు పార్టీలకు పట్టున్న ప్రాంతంలో ఉమ్మడిగా సభ పెట్టారు.. ఎంత చేసినా జనం రారని తెలుసుకాబట్టే తక్కువ స్థలంలో ఏర్పాట్లు చేశారు.. ఆ స్థలం కిక్కిరిస్తే.. దానినే కొండంతలు చేసి చూపిస్తూ చంకలు గుద్దుకోవాలని స్కెచ్ వేశారు.. తీరా 40–50 వేలు కూడా దాటక పోవడంతో బిక్క మొహం వేయడం బాబు, పవన్‌ల వంతు అయితే.. ఇలాగైతే ఈ ఎన్నికల్లోనూ ఏడిసినట్లే అనుకోవడం ఇతర నేతలు, కార్యకర్తల వంతు అయింది. ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిరో టీ–జే మీటింగ్’ అని పాడుకోవాల్సిన తరుణమిది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, భీమవరం : జనాదరణ లేక టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ తుస్సుమంది. అంతా.. ఇంతా.. నభూతో.. అన్నట్లు నాలుగైదు రోజులుగా ఊదరగొట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు ఈ సభకు వచ్చిన జనం మాటెత్తడం లేదు. టీడీపీ–జనసేన పొత్తుకు జనం మద్దతును ఈ సభతో చాటిచెబుతామంటూ ఇరు పార్టీల అధినేతలు హడావుడి చేశారు. కేడర్ నిరసనల్ని, మనోభావాల్ని లెక్కచేయకుండా చంద్రబాబు, పవన్‌ల వ్యక్తిగత అ‘జెండా’తో నిర్వహించిన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆరు లక్షల మంది తరలివస్తారంటూ ఎల్లో మీడియాలో మోత మోగించారు.
తాడేపల్లిగూడెం సమీపంలో 22 ఎకరాల ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. తీరా టీడీపీ–జనసేన పార్టీల కేడర్ నిరాదరణతో కాస్తా ఫ్లాప్ షోగా మిగిలింది. ఈ పొత్తు తమకు అంగీకారం కాదని స్పష్టం చేస్తూ నాయకులు, కింది స్థాయి కేడర్ సభను తుస్సుమనిపించారు. ప్రజలు పొత్తుకు బ్రహ్మరథం పడతారని చంద్రబాబు, పవన్‌లు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. టీడీపీ–జనసేన సంయుక్తంగా నిర్వహించిన తొలి బహిరంగ జెండా సభకు వారి లక్ష్యంలో పది శాతం మంది కూడా రాకపోవడం ఆ పార్టీల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని ఫోన్లలో సమాచారం అందించినా, ఆ సభకు హాజరైన వారి సంఖ్య చూసి ఆ పార్టీల అగ్ర నేతలు విస్తుపోయారు. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సగం పైగా కుర్చీలు ఖాళీగా కనిపించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కంగుతిన్నారు.
టీ–జే పార్టీ నేతల్లో నైరాశ్యం
పొత్తు ముసుగు తొలగిపోయి జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేనలో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్ చెల్లాచెదురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చోవడానికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్‌లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు.
వేదిక, హెలి ప్యాడ్‌లు, వీవీఐపీల రెస్ట్ రూమ్‌లు, పార్కింగ్‌కు ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశారు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీల చొప్పున 22 గ్యాలరీల్లో 33 వేల కుర్చీలు వేశారు. మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క. అయితే సభ ప్రారంభం నుంచి చివరిదాకా సగం గ్యాలరీలు ఖాళీగానే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు గంటలు ఆలస్యంగా 5.30 గంటలకు మొదలైంది. మొత్తం 22 గ్యాలరీలు ఏర్పాటుచేసి ప్రముఖులు, మీడియా, మహిళల కోసం ఆరు గ్యాలరీలు, మిగిలినవి కార్యకర్తలకు కేటాయించారు
. పట్టుమని 11 గ్యాలరీలు కూడా నిండలేదు. మిగిలిన గ్యాలరీలన్నీ సగం ఖాళీగానే కనిపించాయి. సాయంత్రం 5 గంటలకు కూడా సగం గ్యాలరీలు నిండలేదు. వాస్తవానికి ఆరు లక్షల మంది జనం వస్తారని టీడీపీ–జనసేన నేతలు చెప్పారు. అయితే అది సాధ్యం కాదని వారికీ తెలుసు. అందుకే తక్కువ స్థలం ఉన్న చోట సభ నిర్వహించి, జనం కిక్కిరిసిపోతే.. దానినే కొండంతలు చేసి చూపాలన్న టీడీపీ, జనసేన అగ్రనేతల పన్నాగం బెడిసికొట్టింది. మొత్తంగా 40–50 వేల మంది కూడా హాజరు కాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.
ప్రసంగాలకు స్పందన నిల్
సినీ నటుడు బాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ, జనసేన నేతలు ప్రసంగించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసేవారికే ప్రసంగించే అవకాశం ఇచ్చారు. కేడర్ నుంచి మాత్రం వారి ప్రసంగాలకు స్పందన రాలేదు. చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని రెండు పార్టీల కేడర్ తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ప్రసంగిస్తుండగానే అనేక మంది తిరుగుముఖం పట్టారు. పవన్‌కళ్యాణ్ ప్రసంగించే సమయానికి జనం మరింత పల్చబడ్డారు.
ఈ సభలో అన్నీ వెరైటీలే. సభా ఏర్పాట్ల నుంచి అన్ని వన్ బై టూ ఫార్ములాలోనే కొనసాగాయి. జనసేన, టీడీపీ కేడర్ కూడా ఏర్పాట్లు చూసి విచిత్రంగా అనిపించి నవ్వుకున్నారు. గ్యాలరీల్లో ప్రతి కుర్చీలో టీడీపీ, జనసేన జెండాలు పెట్టారు. ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ పార్టీ జెండా ఊపుతూ ఈలలు వేసేలా ఏర్పాటు చేశారు. గ్యాలరీలు నిండక, జనాలు రాక, రెండు జెండాలు పట్టుకోవడానికి కేడర్ ఇష్టపడక పోవడంతో అసలు ప్లాన్ వర్కవుట్ కాలేదు.
ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఇద్దరూ చెరో హెలికాప్టర్‌లో చేరుకున్నారు. తర్వాత ఒకే బస్సులో ముప్పావు గంటకు పైగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వేదికపైకి వచ్చి మొత్తం కలియదిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇద్దరూ కరచాలనం చేస్తూ హడావుడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీ జెండాను, పవన్ కళ్యాణ్ జనసేన జెండాను ఊపి, తర్వాత జెండాలు మార్చుకున్నారు. వేదికపై చంద్రబాబుకు కుడివైపున టీడీపీ నేతలు ఒక గ్రూపుగా, పవన్‌కళ్యాణ్‌కు ఎడమ వైపున జనసేన నేతలు మరొక గ్రూపుగా కూర్చున్నారు.
ఇది ప్రజల పొత్తు, చారిత్రక అవసరమంటూ చంద్రబాబు ముగించగా, 24 సీట్లు ఏమీ తక్కువ కాదు.. నన్ను అభిమానించే వాళ్లెవరూ ప్రశ్నించవద్దంటూ పొత్తుల ప్రస్తావనకు పవన్ ఫుల్‌స్టాప్ పెట్టారు. బూత్ స్థాయిలో బలం లేని మనం ఎక్కువ సీట్లు ఎలా అడగాలంటూ జనసేన కార్యకర్తల్ని పవన్ తీవ్రంగా నిరాశపరిచారు. టీడీపీ నేత నారా లోకేశ్ తొలి ఉమ్మడి సభకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
సభలంటే అలా పెట్టాలి
టీడీపీ–జనసేన ఉమ్మడి సభకు హాజరైన పలువురు కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభల గురించి మాట్లాడుకున్నారు. ఆ స్థాయిలో ఈ సభ ఉంటుందనుకున్నామని, ఇలా పేలవంగా జరుగుతుందనుకోలేదని నిట్టూర్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వ తేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు.
సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద 110 ఎకరాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6–7 లక్షల మందికిపైగా జనం తరలివచ్చారు. రాప్తాడులో 18న నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదికపోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment