ఏపీ సీఎం చంద్రబాబు నిప్పు కాదని, ఆయన ఒళ్లంతా కుళ్లు, మనసులో దరిద్రపు ఆలోచన నిండి ఉంటుందని...
మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మాకు మద్దతిస్తే తప్పేంటి?
తెలంగాణకు, ఆంధ్రకు ఏమైనా యుద్ధం జరిగిందా?
చంద్రబాబు సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నిప్పు కాదని, ఆయన ఒళ్లంతా కుళ్లు, మనసులో దరిద్రపు ఆలోచన నిండి ఉంటుందని రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజల్లో అనవసరపు సెంటిమెంట్లను రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన సచివాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలతో కలసి మీడియాతో మాట్లాడారు.
ఫోన్లు ట్యాప్ చేసే నీచమైన సంస్కృతి, దరిద్రపు ఆలోచన బాబుదేనని, తమకు అలాంటి అవసరంలేదని మండిపడ్డారు. ‘బాబుకు తన కేబినెట్ మంత్రులపై విశ్వాసం లేకనే ట్విట్టర్‌పిట్ట (లోకేశ్) చేత, ప్రతీ మంత్రి వద్ద నిఘా పెట్టించిండు. ఏపీ మంత్రులు కూడా భయంతో చస్తున్నరు. ఈ టైంలో మాట్లాడకపోతే తీసేస్తరేమోనని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మాకు మద్దతిస్తే తప్పేంటి? తెలంగాణకి, ఏపీకి యుద్ధం జరి గిందా? అనవసరంగా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నరు’ అని అన్నారు.
బాబు మాదిరి చిల్లర రాజకీయాలు తాము చేయబోమని, ఏదైనా ధైర్యంగా ఢీకొంటామని అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రవహింప చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. ‘తెలంగాణలో జరిగిన మాదిరిగా ఆంధ్రలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గనక చేసుంటే.. జగన్ మీద కేసు పెట్టేవారు. ఒక వర్గం మీడియా నిత్యం దుమ్మెత్తి పోసేది’ అని వ్యాఖ్యానించారు. హైటెక్కు అని చెప్పుకునే బాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కూడా రాలేదని, ఆరుగురు ఎమ్మెల్యేలు నోటాకు ఓటు వేశారని ఎద్దేవా చేశారు.