
నిషేధంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు
విగ్రహాల ఎత్తు తగ్గింపు చర్యలపై అధ్యయనం చేయండి
జీహెచ్‌ఎంసీకి ఆదేశం
హైదరాబాద్: ఈ ఏడాది హైదరాబాద్ లోని హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిస్థాయిలో నిషేధించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విగ్రహాల ఎత్తును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అధ్యయ నం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు తెలిపింది. ఈ రెండు విషయాల్లో అందరి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలను ఈ నెల 20న తమ ముందుంచాలంది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం ద్వారా నీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని గతం లో ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ పలువురు ఐఏఎస్ అధికారులను ప్రతివాదులుగా చేస్తూ న్యాయవాది వేణుమాధవ్ ధిక్కారపిటిషన్ దాఖలు చేశా రు. దీనిని ధర్మాసనం మరోసారి విచారిం చింది. బెంగళూరు విధానాన్ని ఇక్కడ అమలు చేయడం కష్టసాధ్యమని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కేశవరావు కోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని తాము పర్యవేక్షిస్తామంటూ విచారణను వాయిదా వేసింది.