
అవును.. ఆ నిర్ణయం తప్పే!
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రచించిన ‘ద శాటానిక్ వెర్సెస్’ పుస్తకంపై 27 ఏళ్ల క్రితం (1988లో) అప్పటి ప్రధాని రాజీవ్
రష్దీ పుస్తకం నిషేధంపై చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రచించిన ‘ద శాటానిక్ వెర్సెస్’ పుస్తకంపై 27 ఏళ్ల క్రితం (1988లో) అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిషేధం విధించటం తప్పేనని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ లిటరరీ ఫెస్ట్’కు హాజరైన చిదంబరం.. (ఈ పుస్తక నిషేధం సమయంలో రాజీవ్ హయాంలో చిదంబరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు) ‘రష్దీ పుస్తకంపై నిషేధం తప్పే. నన్ను 20 ఏళ్ల క్రితం అడిగినా ఇదే సమాధానం చెప్పేవాడిని’ అని అన్నారు. ఎమర్జెన్సీ విధించటం కూడా పొరపాటేనని.. అయితే 1980లో ఇందిరాగాంధీ ఈ విషయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. మరోసారి అధికారంలోకి వస్తే ఎమర్జెన్సీ ఉండదన్న ఇందిర ప్రకటనను స్వాగతించిన ప్రజలు మళ్లీ ఆమెకు పట్టంగట్టడాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఆ సూత్రం మాకూ వర్తిస్తుంది: జైట్లీ
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్(మూల నిర్మాణ సిద్ధాంతం) రాయలేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, పార్లమెంటు సార్వభౌమత్వాన్ని కాపాడేందుకూ ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఒక వ్యవస్థను కాపాడేందుకు మిగిలిన వ్యవస్థలను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదన్నారు. టైమ్స్ లిట్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ.. ఎన్‌జేఏసీని సుప్రీంకోర్టు మరోసారి పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతానికి ఎన్‌జేఏసీని కొట్టివేసినా.. భవిష్యత్‌లో దానిపై చర్చించాల్సి వస్తుందన్నారు. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించాక రాష్ట్రపతే జడ్జీలను నియమిస్తారని రాజ్యాంగం చెబుతుంది. కానీ కొలీజియం వ్యవస్థ ద్వారా సీజేఐ ఎవరినీ సంప్రదించకుండా నేరుగానే నియమకాలు చేపడతారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం’ అని అన్నారు.