‘ట్రై జంక్షన్’పై చైనా కన్ను
♦ భారతదేశ భద్రతకు ముప్పు ∙రాజ్యసభలో సుష్మా స్వరాజ్
♦ చర్చలతోనే పరిష్కారం.. ఇరు సైన్యాలు వెనక్కి మళ్లాలి
♦ రైతు సమస్యలపై రెండోరోజూ లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసన
న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దుల్లో ట్రై జంక్షన్ వద్ద భూటాన్ భూభాగంపై ఆధిపత్యానికి చైనా ప్రణాళికతో ఉందని, అది భారతదేశ భద్రతకు ముప్పని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సమాధాన మిస్తూ.. 2012లో డోక్లాంపై భారత్, చైనా, భూటాన్‌ల మధ్య లిఖితపూర్వక ఒప్పందం జరిగిందని, మూడు దేశాలు కలిసి ట్రై జంక్షన్ సరిహద్దుల్ని నిర్ణయించాలని అందులో పేర్కొ న్నారన్నారు. గతంలోనూ రోడ్ల నిర్మాణానికి చైనా ప్రయత్నించిందని, ఇప్పుడు ఏకంగా బుల్ డోజర్లు, ఇతర యంత్రాల్ని తీసుకొచ్చిం దని సుష్మ వెల్లడించారు.
ట్రై జంక్షన్‌కు చేరుకుని దాన్ని ఏకపక్షంగా ఆధీనం లోకి తెచ్చుకోవాలన్నదే చైనా ఉద్దేశమని.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ చైనాకు భూటాన్ లేఖ కూడా రాసిందని ఆమె తెలిపారు. ‘చర్చల ద్వారా వివాదం పరిష్కారాన్ని భారత్ కోరు తుంది. అయితే ముందుగా ఇరు దేశాలు తమ సైన్యాల్ని వెనక్కి పిలిపించాలి. డోక్లాం సరిహ ద్దు అంశంలో భారత్ అనవసరంగా తలదూర్చ లేదు.. మన దేశ వైఖరికి అన్ని దేశాలు మద్దతి స్తున్నాయి’ అని విదేశాంగ మంత్రి పేర్కొన్నా రు. మరోవైపు చైనాతో వివాదంపై విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే విలేకరులతో మాట్లాడుతూ.. ఈ అంశంపై భూటాన్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తు న్నామని వెల్లడించారు.
గోరక్షణ పేరిట జరుగుతున్న హింస, హత్య లపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు ప్రధాని నరేంద్ర మోదీ యే కారణమని, అదే సమయం లో గోరక్షణ హత్యలపై ఆయన రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ తప్పుపట్టింది. గోరక్షకుల్ని అడ్డుకునేందుకు ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. ‘దళితులు, మైనార్టీలపై దాడులు, హత్యాచా రాల పెరుగుదల’ అంశంపై సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘2017లోనే ఎక్కువ హత్యలు చోటుచేసుకున్నాయి’ అని పేర్కొన్నారు. 2017లోనే ఇంత భారీ హింస ఎందుకు చోటుచేసుకుందని ప్రశ్నించారు.
తన ప్రసంగా ల ద్వారా సెంటిమెంట్లను ప్రధాని మోదీ రెచ్చగొట్టారని సిబల్ ఆరోపించారు. అక్టోబర్ 8, 2015, ఆగస్టు 6, 2016, జూన్ 29, 2017ల్లో ప్రధాని చేసిన ప్రసంగాల్ని ఈ సందర్భంగా సిబల్ ప్రస్తావించారు. గోరక్షకుల అంశంలో నరేంద్ర మోదీ రాత్రి ఒకలా, పగలు మరోలా మాట మారుస్తున్నారని, మహాత్మా గాంధీ గురించి మోదీ తరచూ ప్రస్తావిస్తే సరిపోదని, ఆయన బాటలో నడవాలని సూచించారు. ‘గోరక్షక్ పవిత్ర సైన్యం’ ఏర్పాటుకు వీహెచ్‌పీ ప్రకటన చేయడంతో పాటు 2,700 మందిని నియమించుకుందని, వారికి బజరంగ్‌దళ్ శిక్షణ ఇచ్చిందన్నారు.
మోదీ 49 దేశాలు సందర్శించారు
మోదీ గత మూడేళ్లలో 49 దేశాల్లో పర్యటించారని విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 2014 ద్వితీయార్థంలో ప్రధాని 8 దేశాల్లో పర్యటించినట్లు రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. గత 7 నెలల్లో 10 దేశాలను సందర్శించారు.
ట్రంప్‌తో ‘హెచ్1బీ’ని చర్చించిన మోదీ
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీలో హెచ్1బీ వీసా అంశాన్ని మోదీ చర్చించారని రాజ్యసభలో సుష్మా తెలిపారు. భారత నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న సేవలను ఆ సందర్భంగా మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. వీసాలపై అమెరికా నియంత్రణలు విధించిన నేపథ్యంలో గురువారం సుష్మా స్వరాజ్ రాజ్యసభలో పలు ప్రశ్నలకు బదులిస్తూ...భారత నిపుణుల సేవలు ఇరు దేశాలకు లబ్ధిచేకూరుస్తున్నాయన్న సంగతిని ట్రంప్ అంగీకరించారని తెలిపారు. భారత వృత్తి నిపుణుల ప్రయోజనాలను దెబ్బతీస్తే అంతిమంగా అమెరికానే నష్టపోతుందని పేర్కొన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసన
రైతుల దుస్థితిపై చర్చించాలంటూ లోక్‌స భలో ప్రతిపక్షాలు సభా కార్యకలాపాల్ని స్తంభింపచేశాయి. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. ఇంతలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాం డ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు కొనసాగిం చారు. బుధవారం రాత్రే ఈ అంశంపై చర్చ ముగిసిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అన్నారు.
కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. తర్వాత సమావేశమ య్యాక.. కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదా లు మొదలుపెట్టారు. గందరగోళం మధ్య మరోసారి సభ వాయిదాపడింది. 12 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ జీరో అవర్‌ను ప్రారంభించారు. విపక్షాలు మాత్రం వెల్‌లోకి వచ్చి నిరసనను కొనసాగించాయి. గుట్కా స్కాంపై సీబీఐ విచారణ జరపాలని అన్నాడీఎంకేఎంపీలు వెల్‌లోకి దూసుకురావడంతో సభను స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు.