చైనా.. భారత్‌ని చూసి నేర్చుకో!
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పరోక్షంగా మన పొరుగుదేశం చైనాకు చురకలు అంటించారు. అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పులను ఏ విధంగా గౌరవించాలో భారత్‌ను చూసి చైనా నేర్చుకోవాలని హితవు పలికారు.
దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం తనకే ఉందని మొండిగా వాదిస్తున్న చైనా.. ఈ విషయంలో హెగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును బాహాటంగా ధిక్కరించిన సంగతి తెలిసిందే. కానీ, దక్షిణ సముద్రం తరహా వివాదమైన బంగ్లాదేశ్‌తో సముద్ర జలాల సరిహద్దుల విషయంలో భారత్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును గౌరవించింది. తీర్పు ప్రకారం నడుచుకొని వివాదాన్ని ముగించింది. ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించిన జాన్ కెర్రీ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ చట్టానికి కట్టుబడే దేశమని కితాబిచ్చారు. (చదవండి: చైనాకు భారీ ఎదురుదెబ్బ!)
’బంగ్లాదేశ్‌తో సముద్ర జలాల సరిహద్దుల విషయంలో అంతర్జాతీయ తీర్పును ఒప్పుకోవడం ద్వారా భారత్ తన విశిష్టతను చాటుకుంది. వివిధ ప్రాంతాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తున్న వివాదాల్లో పరిష్కరానికి ఇది నమూనాగా నిలుస్తుంది. దక్షిణ చైనా సముద్రం సహా పలు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఈ విధానం అనుసరణీయం’ అని కెర్రీ కొనియాడారు. దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో సైనిక పరిష్కారానికి తావు లేదని ఆయన అన్నారు. అయితే, కష్టకాలంలో తన మిత్రదేశాలకు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.