
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల స్వాతంత్య్రం రాలేదు
సినీనటి, కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రమ్య మరోసారి మాటల తూటాలు పేల్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించలేదని అన్నారు.
మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమ్య
మండ్య: సినీనటి, కర్ణాటక కాంగ్రెస్ నాయకురాలు రమ్య మరోసారి మాటల తూటాలు పేల్చారు. పాకిస్థాన్ నరకం కాదంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారకముందే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించలేదని కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మాత్రమే స్వాతంత్య్రం లభించిందని అన్నారు. మంగళవారం మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యార్థిగళ నడె దేశద బెళవణిగె కడె’ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రమ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం పోరాడుతుండగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ఆంగ్లేయులతో కలసిపోయారని ఆమె ఆరోపించారు. జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్ నుంచి సర్.ఎం.విశ్వేశ్వరయ్య సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులతో కలసి 3,500 అడుగుల పొడవైన జాతీయజెండా ప్రదర్శన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కేంద్ర కార్యకర్తల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యను చూడడానికి, ఆమెతో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు పోటీ పడ్డారు.