
సర్వేలు తారుమారు.. ట్రంప్ ముందంజ!
వాషింగ్టన్: సర్వేలు తారుమారు అవుతున్నాయి. అంచనాలు తప్పుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. ఓటింగ్ ముందు రోజు వరకు అన్ని సర్వేలు విజయం ఖాయమన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా వెనుకబడ్డారు.
భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం కౌంటింగ్ మొదలైంది. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 167, హిల్లరీ 109 ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. అమెరికాలో ట్రంప్ 17 రాష్ట్రాలు, హిల్లరీ 10 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించారు. 14 రాష్ట్రాల్లో ట్రంప్, హిల్లరీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు కావాలంటే ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు సాధించాలి. కౌంటింగ్ ఫలితాల ట్రెండ్ ఇలా కొనసాగితే ట్రంప్ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి.
విద్వేషకర, వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిల్లరీ 90 శాతం గెలిచే అవకాశముందని ఓటింగ్ ముందురోజు తుది సర్వే వెల్లడించింది. హిల్లరీయే గెలుస్తుందని మీడియా కూడా అంచనా వేసింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ దూసుకెళ్తున్నారు. కీలక రాష్ట్రమైన ఫ్లోరిడా సహా వర్జీనియా, ఒహియోలో ట్రంప్ ముందంజలో ఉన్నారు.