తప్పుడు కేసులపై వాటికా గ్రూపు ఆగ్రహం
తప్పుడు కేసులపై వాటికా గ్రూపు ఆగ్రహం
Published Sat, Sep 17 2016 1:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
గూర్గావ్ : రియల్ ఎస్టేట్ డెవలపర్ వాటికా గ్రూపుపై వచ్చిన ఆరోపణలను, నమోదైన తప్పుడు కేసులను ఆ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సీనియర్ అధికారులు తిప్పికొడుతున్నారు. చీటింగ్కు పాల్పడామంటూ తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అవన్నీ తప్పుడు ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే వాటికా గ్రూపు ఎండీ గౌతమ్ భల్లా, గ్రూపు డైరెక్టర్లు అనిల్ భల్లా, గౌరవ్ భల్లా, క్లైయింట్ సర్వీసు హెడ్ అంకిత్ నాగ్పాల్లపై చీటింగ్ కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన స్యాంత్పురా వాసి సుమన్ ప్రీత్ కౌర్, ఆమె భర్త సురేంద్ర పాల్ సింగ్ ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ సెక్షన్లు 406,420ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
అయితే కంపెనీ రిప్యూటేషన్ను దెబ్బతీయడానికే ఇలాంటి చీటింగ్ కేసులను తమపై పెడుతున్నారని వాటికా గ్రూపు సీఆర్ఎమ్ అధినేత వికాస్ మన్హాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోపణల్లో నిజమెతుందో త్వరలోనే బయటపడుతుందని ధీమా వ్యక్తంచేశారు. పోలీసుల విచారణలో కచ్చితంగా నిజనిజాలను బయటకి వస్తాయని, ఫిర్యాదుదారులు నిజాలను దాచిపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఫిర్యాదుదారులు వాటికా వన్ ఎక్స్ప్రెస్ సిటీలో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారని, దానికోసం 22 లక్షల వరకు ఇన్స్టాల్ మెంట్లో చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే తాము 2015 డిసెంబర్లో సైట్కి వెళ్లి చూస్తే, ఇంకా స్థలం బంజరు భూమిలానే ఉందని చెప్పారు.
తాము చెల్లించిన నగదును రీఫండ్ చేయాలని కోరినప్పుడు, ఆ ప్రాజెక్టు రద్దైందని, కొత్త ప్రాజెక్టుకు తమ నగదు బదిలీ చేయాలని అప్పుడే రీఫండ్ చేస్తామని కంపెనీ అధికారి నాగ్పాల్ బెదిరించినట్టు ఫిర్యాదులో కౌర్ పేర్కొన్నారు. ఆ నగదును వాటికా ఇతర ప్రాజెక్టులకు మరలించినప్పటికీ, తమ చెల్లింపులు వెనక్కి రాలేదని వాపోయారు. రీప్లేస్మెంట్లో బెదిరించి వాటికా సెవన్ ఎలిమెంట్స్లో ఓ ఫ్లాట్ బుక్ చేశారని, కానీ తాము బుక్ చేసుకున్నదానికి, కంపెనీ ఆఫర్ చేసిన దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు శాఖలోని ఆర్థిక అక్రమాల విభాగం విచారణ జరుపుతోంది.
Advertisement