కాంగ్రెస్ ది 'హిట్ అండ్ రన్' పాలసీ: బీజేపీ
న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను పదే పదే అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై అధికార బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ 'హిట్ అండ్ రన్' విధానం అవలంభిస్తోందని ఆరోపించింది. హస్తం చేసిన ఆరోపణలపై సభలో ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా అడ్డుకుంటోందని దుయ్యబట్టింది.
'రాజ్యసభలో కాంగ్రెస్ అడిగిన దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటుంది. అంతలోనే కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకుంటారు. తర్వాత బయటికి వెళ్లిపోతారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆటంక రాజకీయాలు చేయడం ఇదే తొలిసారి. ఇలా జరగడం దేశానికి మంచిది కాదు' అని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.
రాజ్యసభ వాయిదా పడిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.