ఆయనను బుజ్జగిస్తాం.. ఒప్పిస్తాం!
బెంగళూరు: సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నది. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. కాంగ్రెస్ వర్కింట్ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకొని విశ్రాంత జీవితం గడపాలని ఆయన కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఆయన ఆకస్మిక నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు స్పందించారు. ఆయనను ఒప్పించి.. తిరిగి పార్టీలో కొనసాగేలా చూస్తామని పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలిపారు. 'బెంగళూరు వెళ్లి ఆయనతో మాట్లాడుతాను. ఆయన ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏమిటో తెలుసుకుంటాను. ఆయన చాలా సహేతుకంగానే నిర్ణయాలు తీసుకుంటారు' అని కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ధరమ్ సింగ్ పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ ' ఆయన సీనియర్ నాయకుడు. ఎలాంటి తప్పు చేయబోరు. ఆయనను కలిసేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. విషయం ఏమిటో తెలుసుకొని నిర్ణయం మార్చుకునేలా చూస్తాను' అని చెప్పారు.
1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ.. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, 2009 నుంచి 2012 వరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో విభేదాల వల్లే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.