కృష్ణకు బీజేపీ తీర్థం!
సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ ఈ నెల 15న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. అటుపై బెంగళూరుతో పాటు మైసూరు, మండ్యా తదితర ప్రాంతాల్లో జరిగే సభల్లో ఆయన రాజకీయ అనుచరులు బీజేపీలో చేరతారు.
గుండ్లుపేట, నంజనగూడు ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఎస్.ఎం కృష్ణ పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వెంటనే ఆయనను పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించడం తెలిసిందే. భవిష్యత్‌లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన అందుకు సమ్మతించారు. ఆయన గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అమిత్‌షా నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల్లో బెంగళూరుతో పాటు దక్షిణ కర్ణాటకలో బీజేపీ గెలుపు తన బాధ్యత అని ఎస్‌ఎం కృష్ణ భరోసా ఇచ్చినట్లు కమలనాథులు చెబుతున్నారు.