లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తమ కార్యాచరణను ముమ్మరం చేశాయి.
న్యూఢిల్లీ: లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తమ కార్యాచరణను ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీజేపీ తన రెండో జాబితాను విడుదల చేసి ముందంజంలో ఉండగా, కాంగ్రెస్ తన తొలి జాబితాను శనివారం సాయంత్రం విడుదల చేసింది. 194 మందితో కూడిన లోక్ సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో క్రికెటర్ మహ్మద్ కైఫ్ పోటీ చేసే స్థానాన్ని ఖరారు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని పూల్పూర్ నియోజకవర్గాన్ని కైఫ్ కు కేటాయించింది. ఇదిలా ఉండగా దక్షిణ బెంగళూర్ నుంచి నందన్ నీలేకని, బిలాస్ పూర్ నియోజకవర్గం నుంచి వాజ్ పాయ్ మేనకోడలు కరణా శుక్లా పోటీకి సిద్దమవుతున్నారు.
మహారాష్ట లోని సోలాపూర్ నుంచి హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పోటీలో నిలువనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్ బరేలి నుంచి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమేథీ నుంచి లోక్ సభ అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 35 శాతం మంది 50 ఏళ్ల లోపువారే ఉండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో 28 మంది మహిళలు సీట్లు దక్కించుకున్నారు.