దోషులుగా తేలిన చట్టసభ్యులపై అనర్హత వేటు పడకుండా చూసే ఉద్దేశంతో తెచ్చిన ఆర్డినెన్స్ అంశాన్ని ప్రభుత్వం ముగిసిన అధ్యాయంగా అభివర్ణించింది.
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన చట్టసభ్యులపై అనర్హత వేటు పడకుండా చూసే ఉద్దేశంతో తెచ్చిన ఆర్డినెన్స్ అంశాన్ని ప్రభుత్వం ముగిసిన అధ్యాయంగా అభివర్ణించింది. ఆర్డినెన్స్‌పై రాహుల్ తన అభిప్రాయాలను బలంగా వినిపించారని, ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుందని గురువారం కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు రాహుల్‌ను కాంగ్రెస్ తన కోర్ గ్రూప్‌లో చేర్చుకోవాలని యూపీఏ భాగస్వామ్య పార్టీ అయిన ఎన్సీపీ సలహా ఇచ్చింది.
రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాలని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే తగిన ఆలోచన చేయాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ఇదిలా ఉండగా, ఆర్డినెన్స్ అంశంలో యూపీఏ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. దోషులుగా తేలిన చట్టసభ్యులపై అనర్హత వేటు పడకుండా చూసేందుకు రూపొందించిన ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లుకు విపక్షం తొలుత మద్దతు పలికినట్లుగా యూపీఏ మంత్రులు ప్రచారం సాగిస్తున్నారని, అయితే, తాము తొలి నుంచీ దీని వ్యతిరేకంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ఈ అంశంపై ఆగస్టు 13న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఖరారు చేసి, పార్లమెంటు స్థాయీ సంఘానికి సిఫారసు చేయనున్నట్లుగా ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే, ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, ఈ అంశంపై రాజ్యాంగ సవరణ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారన్నారు.