యూపీ అసెంబ్లీ భవనం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పేల్చివేత కుట్ర కేసు ఊహించని మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సభలో వెల్లడించినట్లు.. ఎమ్మెల్యే సీటు కింద దొరికింది అసలు పేలుడు పదార్థం కానేకాదని తేలింది. దీంతో మామూలు పౌడర్‌ను శక్తిమంతమైన బాంబుగా పేర్కొంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారిపై వేటు పడింది.
జులై 13న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే సీటు కింద అనుమానాస్పద ప్యాకెట్ లభించడం, అధికారులు చెప్పినదాన్ని బట్టి అది బాంబేనని సీఎం ప్రకటించడంతో కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. నాటి ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. 50 రోజులపాటు పలు కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి నిజాన్ని నిగ్గుతేల్చారు.
‘‘ఆ ప్యాకెట్‌లో ఉన్నది కేవలం పౌడర్ మాత్రమే. కానీ ఫోరెన్సిక్ అధికారి దానిని శక్తిమంతమైన పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్)గా చెప్పారు. తప్పుడు ధృవీకరణ ఇచ్చి భయభ్రాంతికి కారణమైన అతనని సోమవారం అరెస్ట్ చేశాం’’ అని యూపీ పోలీస్ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు. ఆ అధికారి ఎందుకలా చెప్పారు? అసలు ఆ ప్యాకెట్ ఎమ్మెల్యే సీటు కిందికి ఎలా వచ్చింది? అనే విషయాలు త్వరలోనే తేలతాయని పేర్కొన్నారు.