ఈ ఏడాది చివరి నాటికి షిర్డి సమీపంలోని ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అవుతోందని మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలెప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఎండీ తనజి సత్రి శుక్రవారం షిర్డిలో వెల్లడించారు. నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఎయిర్పోర్ట్లో రన్ వే నిర్మాణం ఇప్పటికే పూర్తి అయిందని, టెర్మినల్కు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు.
సాయనాధుని దివ్య సన్నిధిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది మంది భక్తులు షిర్డీ విచ్చేస్తారని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి అయితే సులభంగా షిర్డీ చేరుకునే సౌకర్యం ప్రయాణికులకు కలుగుతోందని ఆయన చెప్పారు. షిర్డీ పట్టణానికి 14 కిలో మీటర్ల దూరంలోని కాకడి గ్రామం వద్ద ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సాయిబాబ దేవాలయ ట్రస్ట్ రూ. 45 కోట్లను విరాళంగా అందజేసిన సంగతిని ఈ సందర్బంగా తనజి సత్రి గుర్తు చేశారు.