
ఆ అమ్మాయి గొడవపడి వెళ్లింది.. కానీ!
పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోవటం జరుగుతునే ఉన్నాయి.
ముంబాయి: పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోవటం జరుగుతునే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే ముంబాయిలో చోటుచేసుకుంది. స్వాతి కంగే(17) ఇంట్లో గొడవపడి ఆగస్టు 16వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. మిసింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆగస్టు 22న ఆ బాలికను గుర్తించారు. దానికి సంబంధించిన ఒక భావోద్వేగ కుటుంబ పున: కలయిక చిత్రాన్ని పోలీసులు ట్వీట్ చేశారు.
స్వాతి (17) ఆంధ్ర కళాశాలలో సైన్స్ విభాగంలో చదువుతోంది. తల్లిదండ్రులతో వివాదం వచ్చిన తరువాత ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆంధేరి పోలీస్ స్టేషన్‌లో ఆమె తండ్రి దయానంద్ కంగే మిసింగ్ కేసు ఫిర్యాదు చేశారు. ఆ బాలికను గుర్తించేందుకు పోలీసులు నాలుగు గ్రూపులుగా విడిపోయి తీవ్రంగా గాలించారు. పోలీసులు దాదాపుగా ఏడు సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేయటమే కాక ఆ అమ్మాయి స్నేహితులతో సహా చాలా మందిని ప్రశ్నించారు.
మంగళవారం ఆంధేరి పోలీసు స్టేషన్ పీఎస్ఐ చేతన్ పాచెల్వర్, కానిస్టేబుల్ చవాన్‌లు ఆ అమ్మాయి డివాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం పొందారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని తెల్లవారుజామున నాలుగు గంటలకు థానే ప్రాంతంలో ఆమెను గుర్తించి, ఆంధేరికి తీసుకొచ్చారు.
ఆంధేరి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పండిట్ తోరాట్ మాట్లాడుతూ.. ఆంధేరి పోలీస్ స్టేషన్ బృందం తప్పిపోయిన అమ్మాయిని గుర్తించేందుకు చాలా కష్టపడ్డారని అన్నారు. విచారణ జరిపిన తరువాత ఆ అమ్మాయిని కుటుంబానికి అప్పగిస్తామని ఆయన తెలిపారు.
తన కూతురు ఇంటికి వస్తుందని తెలుసుకున్న తల్లి మనసు ఆనందభాష్పలతో నిండిపోయింది. మొత్తం విషయం నాకు తెలియదు. ఆమె కొంత మంది స్నేహితులతో కలిసి వెళ్లిన విషయమే తెలుసు. ఆమె తిరగి సురక్షితంగా ఇంటికి వస్తునందుకు చాలా సంతోషంగా ఉందని తల్లి తెలిపింది.