అవినీతిని సహించేదిలేదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అవినీతిని సహించేదిలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతి అనేది పెద్ద సమస్యగా మారిందని, దేశ ప్రజలను పట్టిపీడుస్తున్న ఈ అవినీతి మహాంమారిని పారద్రోలాలంటూ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఎఫ్ సీసీఐ సమావేశంలో శనివారం పాల్గొన్న ఆయన ఈ అవినీతిపై పోరాడేందుకు యూపీఏ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లుకు ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి బారిన పడి దేశప్రజలు అల్లాడుతున్నారని, ఇకపై అవినీతిని సహించేదిలేదని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిపై ఎన్నో విమర్శలను ఎదుర్కొందని చెప్పారు. కానీ దేశంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోందని రాహుల్ అన్నారు. మన దేశంలో అవినీతిని నియంత్రించే వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించు కోవాల్సి ఉందని రాహుల్ తెలిపారు.