
లాటరీ టికెట్ స్క్రాచ్ చేస్తే.. 66 కోట్ల బంపర్ ప్రైజ్!
పోకీప్‌సీ: 30 డాలర్లు పెట్టి ఓ గేమ్ టికెట్ కొని.. దాన్ని స్క్రాచ్ చేస్తే.. న్యూయార్క్ దంపతులకు ఏకంగా కోటి డాలర్ల (రూ. 66.63 కోట్ల) లాటరీ తగిలింది. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలోనే స్క్రాచ్ ఆఫ్ గేమ్స్‌లో అతిపెద్ద నగదు బహుమతి కలిగిన లాటరీ ఇదే కావడం గమనార్హం. స్క్రాచ్ ఆఫ్ గేమ్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా పది మిలియన్ డాలర్ల నగదు బహుమతితో ఈ లాటరీని నిర్వహించామని, హడ్సన్ వ్యాలీ పోకీప్‌సీ పట్టణంలోని స్టెవార్ట్ దుకాణంలో లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఓ జంటను ఈ బంపర్ అదృష్టం వరించిందని న్యూయార్క్ స్టేట్ గేమ్ కమిషన్ అధికారులు తెలిపారు.
ఈ గేమ్ లాటరీ టికెట్ ధర కేవలం 30 డాలర్లు. అయితే, ఈ లాటరీని గెలుపొందిన అదృష్టవంతులైన దంపతుల పేర్లను అధికారులు వెల్లడించలేదు. విన్నింగ్ టికెట్ కొనుగోలు చేసిన స్టెవార్ట్ దుకాణం సమీపంలోనే గురువారం నాడు ఆ దంపతులకు బహుమతికి సంబంధించిన పెద్ద చెక్కును (క్రికెట్ మ్యాచ్‌లలో ఇచ్చేలాంటిది) లాటరీ అధికారులు అందజేయనున్నారు.