అమిత్ షా పై దాఖలైన ఛార్జిషీటు తిరస్కరణ
ముజాఫర్ నగర్: గత ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నియమావళిని ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేసారంటూ దాఖలైన ఛార్జిషీటు ను స్థానిక కోర్టు కొట్టివేసింది. సాధారణ ఎన్నికల్లో మతపరమైన వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు పిటీషన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని కోర్టు ముందుంచారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. అసలు ఆ ఛార్జిషీటులో అరెస్టు చేయడానికి సరైన కారణాలు చూపకపోవడమే కాకుండా, అరెస్టు వారెంటును కూడా పోలీసులు కోరలేదని కోర్టు తెలిపింది. ఆ ఛార్జిషీటులో పోలీసులు బలమైన కారణాలు చూపకపోవడంతో కొట్టివేస్తున్నట్లు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సుందర్ లాల్ స్పష్టం చేశారు.
' అమిత్ షా వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్ లో సీఆర్పీపీసీలో ఉన్న 173(2) సెక్షన్ ను పోలీసులు విస్మరించారు. అతనిపై అరెస్ట్ వారెంట్ కూడా కోరలేదు. ఓ ప్రైవేటు వ్యక్తి ద్వారా దాఖలైన పిటీషన్ పై ఛార్జిషీటు నమోదు చేసేటప్పుడు ఐపీసీ 188 సెక్షన్ ను అనుసరించడం సరైనది కాదు' అని పోలీసులకు స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నైతిక నియమావళిని ఉల్లంఘించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై చార్జిషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. అమిత్ షా ఎన్నికల్లో మతం, కులం పేరిట ఓట్లను అభ్యర్థించినట్టు అభియోగాలు వచ్చాయి. పోలీసులు పలు సెక్షన్ల కింది షాపై కేసులు నమోదు కేసి ఛార్జిషీటు దాఖలు చేశారు.