వచ్చే లోక్‌సభ ఎన్నికలు, అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం ఆదివారం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలు, అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం ఆదివారం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో చర్చలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తమిళనాడులో ఏఐఏడీఎంకే, అస్సాంలో ఏజీపీలతోనూ చర్చలు జరపనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం రెండు రోజులపాటు జరిగింది. రాబోయే లోక్‌సభ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి కాంగ్రెస్, బీజేపీయేతర వేదిక ఏర్పాటుకు సీపీఎం ఇప్పటికే పిలుపు ఇవ్వడం తెలిసిందే. కాగా సీపీఎం ఇప్పటికే రాజస్థాన్‌లో సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, జేడీ(యూ), జేడీ(ఎస్)లతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది. చత్తీస్‌గఢ్‌లోనూ ఈ ప్రయత్నాలు తుదిదశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదే రీతిలో ముందుకుపోవాలని సీపీఎం నిర్ణయించింది. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్‌లో ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశం చర్చించింది. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రజలతో తిరిగి మమేకమయ్యేందుకు వీలుగా మరింత చురుగ్గా దూసుకుపోవాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును పునరుద్ధరించుకునేందుకు కృషిచేయాలని నిశ్చయించింది.