అనగనగా టాంజానియాలోని సీలస్ గేమ్ రిజర్వు పార్కు.. అక్కడ ఓ కొంగ (దీన్ని స్టార్క్ అంటారు.. చూడ్డానికి మన కొంగలాగే ఉంటుంది), మొసలి ఉన్నాయి. ఓ రోజు చేపలను వేటాడటం కోసం ఈ కొంగ.. ఒంటికాలిపై జపం చేస్తూ కూర్చుంది. ఇంతలో ఓ చేప వచ్చింది. అంతే.. దాన్ని లటుక్కున పట్టేసుకుంది. ఇంకేముంది లొట్టలేసుకుని తినేద్దామనుకుంది. అయితే.. దాని టైం బాగోలేదు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ మొసలి వేగంగా వచ్చేసి.. దాని నోట్లోని చేపను లాగేసుకుంది.
తన చేపను లాగేసుకుంటే.. మన కొంగ ఊరుకుంటుందా.. మొసలి అని కూడా చూడలేదు. ముక్కుతో మొట్టికాయ ఒకటిచ్చుకుంది. మొసలి కాస్తా బిత్తరపోయేసరికి.. దీనికి తెగ ధైర్యమొచ్చేసింది. సాహసం చేయరా ఢింబకా అంటూ ఏకంగా దాని నోట్లోనే బుర్ర పెట్టి.. ఇలా తన చేపను లాగేసుకుంది. ఆహా ఏం రుచి.. అంటూ ఫిష్‌ను ఫినిష్ చేసింది.. కథ కంచికి.. మనం ఇంటికి..
(ఈ ఫోటోలను అమెరికాకు చెందిన ఫోటోగ్రాఫర్ మార్క్ జాన్సన్ తీశారు)